భగీరథమ్మ చెరువు చెర

తెలంగాణ వ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులను తవ్వించి వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు నాటి పాలకులు.

Update: 2024-09-07 10:05 GMT

దిశ, శేరిలింగంపల్లి : తెలంగాణ వ్యాప్తంగా గొలుసుకట్టు చెరువులను తవ్వించి వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు నాటి పాలకులు. నీటి పారుదలలలో తమకు తామే అని చాటుకున్నారు. తదనంతర కాలంలో సుభిక్షంగా ఉన్న తెలంగాణ క్రమంగా తన గత వైభవాన్ని కోల్పోయింది. చారిత్రక ప్రాశస్త్యం చరిత్ర పుటలకు మాత్రమే పరిమితం అయింది. నాటి ఆనవాళ్లను నేడు భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికి అక్కడక్కడ ఉన్న ఆ ఆనవాళ్లు నేడు క్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి.

    హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న వందలాది చెరువులు కుంటల్లో ఇప్పుడు చాలా వరకు మాయమయ్యాయి. అరకొరగా ఇక్కడో అక్కడో ఉన్న చెరువు, కుంటలను కూడా పేరున్న రియలెస్టేట్ సంస్థలు, బడా నిర్మాణదారులు తమ కబంధ హస్తాల్లోకి తీసుకుని అందులోనే బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి కోట్లు కూడబెడుతున్నారు. ఇదే క్రమంలో ఓ బడా రియలెస్టేట్ సంస్థ, పేరున్న నిర్మాత గచ్చిబౌలి డివిజన్ లోని చెరువును చెరబట్టారు. చెరువు స్థలాన్ని కబ్జాచేసిన సదరు నిర్మాత అందులో సినిమా నిర్మాణ సామాగ్రిని వేసి షూటింగ్ లు చేస్తుంటే.. రియలెస్టేట్ సంస్థ ఏకంగా చెరువులోనే బహుళ అంతస్తుల నిర్మాణం చేసింది.

కనుమరుగవుతున్న చెరువులు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువుల చెర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మంగళి చెరువు, టమాటా చెరువులాంటివి కనుమరుగు కాగా అదే జాబితాలో మరిన్ని చెరువులు, కుంటలు చేరుతున్నాయి. గచ్చిబౌలి డివిజన్ లోని భగీరథమ్మ చెరువులో సైతం కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడ్డారు. నానక్ రామ్ గూడ సర్వే నెంబరు 150, 151 లలో, రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ సర్వే నెంబరు 450, 451లలో భగీరథమ్మ చెరువు సుమారు 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. రెండు మండలాల పరిధిలోని మూడు గ్రామాలు నానక్ రామ్ గూడ, ఖాజాగూడ, పుప్పాలగూడ గ్రామాల్లో చెరువు, ఎఫ్టిఎల్, బఫర్ జోన్ విస్తరించి ఉంది. కాగా గచ్చిబౌలి డివిజన్ లో ఉన్న నానక్ రామ్ గూడ గ్రామం సర్వే నెంబరు 150,151లలో గల భగీరథమ్మ చెరువులో కొంతమేర ఆక్రమించి ఓ రియలెస్టేట్ సంస్థ భారీ ఎత్తున మట్టి డంపింగ్ చేసి రహదారి నిర్మాణం చేపట్టింది.

    దీంతోపాటు గతంలో చెరువు రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ను సైతం కూల్చివేసి చెరువు స్థలాన్ని ఆక్రమించారు. అలాగే ఆ సంస్థ సేల్స్ ఆఫీసుకు వెళ్లేదారికోసం చెరువులో మట్టిపోసి చదును చేశారు. వీరు ఆక్రమించిన స్థలం పక్కనే ఉన్న ఓ సినీ స్టూడియో యజమానులు సైతం తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నారు. స్టూడియో యాజమాన్యం సైతం భగీరథమ్మ చెరువు శిఖంలో ఫెన్సింగ్ వేసుకుని షూటింగ్ ల కోసం వినియోగించే సామాగ్రిని అందులోనే ఉంచింది. ఇలా ఇటు ఆ బడా రియలెస్టేట్ సంస్థ, అటు పేరున్న స్టూడియో యాజమాన్యాలు ఎవరికి తోచిన విధంగా వారు భగీరథమ్మ చెరువు శిఖాన్ని అక్రమించారు.

చెరువు విస్తీర్ణం ఇలా..

భగీరథమ్మ చెరువు నానక్ రామ్ గూడా సర్వే నెంబరు 150,151 లలో, రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ సర్వే నెంబరు 450, 451లలో సుమారు 54 ఎకరాల్లో విస్తరించి ఉంది. రెండు మండలాల పరిధిలోని మూడు గ్రామాలు నానక్ రామ్ గూడా, ఖాజాగూడ, పుప్పాలగూడ గ్రామాల్లో చెరువు, ఎఫ్టిఎల్, బఫర్ జోన్ విస్తరించి ఉంది. 2013లో ఇరిగేషన్ అధికారులు నిర్ణయించిన హద్దుల ప్రకారం భగీరథమ్మ చెరువు లేక్ ఐడీ 2924 మొత్తం 54 ఎకరాల్లో విస్తరించి ఉండగా అందులో 30.10.2013 నాటికి 48 ఎకరాల మేర చెరువు నీరు ఉందని పేర్కొంటూ అప్పటి ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ అధికారులు క్లియర్ గా మ్యాప్ తయారు చేశారు.

చెరువు చుట్టూ కబ్జాలు..

భగీరథమ్మ చెరువుచుట్టూ గత కొంతకాలంగా విచ్చలవిడిగా కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. చెరువును ఎండబెట్టి మరీ శిఖం స్థలాన్ని కబ్జా చేస్తూ వస్తున్నారు. రియలెస్టేట్ సంస్థ గతంలో ఈ చెరువును ఆనుకుని స్థలాన్ని సేకరించింది. వారు క్రమంగా ఈ చెరువు శిఖాన్ని ఆక్రమించి అందులో నుండి నీరు పోయేలా ఎండబెట్టి ఆ తర్వాత మట్టితో పూడ్చారు అని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తదనంతరం అదే స్థలంలో నిర్మాణాలకు పూనుకుంది. ఇందులో భాగంగా చెరువుకు వేసిన ఫెన్సింగ్ ను సైతం తొలగించారు.

     అలాగే సహజసిద్ధంగా ఏర్పడిన చెరువు కాలువను సైతం పూడ్చి మట్టిని చదును చేశారు. అంతటితో ఆగని సదరు రియలెస్టేట్ సంస్థ చెరువులో మట్టినిపోసి వారి సేల్స్ ఆఫీసు కోసం కొత్తగా దారిని తయారు చేసింది. ఈ కొత్తదారి పూర్తిగా చెరువు మధ్యలో నుండి వెళుతుంది. దీనివల్ల అటు స్టూడియోకు ఇటు రియలెస్టేట్ సంస్థకు లబ్ది చేకూరుతుంది. చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్న విషయం గతంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి రావడంతో అప్పటి ఆర్ ఐ శ్రీకాంత్ తో కలిసి వెళ్లి రియలెస్టేట్ సంస్థ చెరువులో వేసిన రోడ్డును కొంతమేర తొలగించి రాకపోకలు సాగించకుండా అడ్డంగా మట్టిపోయించారు. దీంతో చెరువులో నుండి వెళ్లే దారి ఆగినా కబ్జాలు మాత్రం అలాగే ఉన్నాయి.

చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్

భగీరథమ్మ చెరువును శుక్రవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆక్రమణలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెరువులో మట్టి, ఇతర వ్యర్థాలను వేస్తుంది ఎవరు అనేదానిపై ఆరా తీశారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, 15 రోజుల గడువు ఇచ్చి ఆక్రమణలను తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. 

Tags:    

Similar News