దారుణం..పెట్రోల్​ పోసుకుని డబ్బులు అడిగిన క్యాషియర్​ను చితకబాదిన వైనం

i20 కారులో రూ.1500 పెట్రోల్​ పోసుకుని డబ్బులు అడిగిన

Update: 2024-12-18 13:53 GMT

దిశ, చార్మినార్​ : i20 కారులో రూ.1500 పెట్రోల్​ పోసుకుని డబ్బులు అడిగిన క్యాషియర్​ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదిన ఘటన ఫలక్​నుమా పోలీస్​ స్టేషన్​ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఫలక్​నుమా ఇన్​స్పెక్టర్​ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ... ఫలక్​నుమా లోని ఎస్సార్​ పెట్రోల్​ ఎల్​పీజీ బంకులో గత కొంత కాలంగా జితేందర్​ (31) అనే యువకుడు క్యాషియర్​గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జితేందర్​ విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో i20 కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు రూ.1500 పెట్రోల్​ పోసుకున్నారు. క్యాషియర్​ పోసుకున్న పెట్రోల్​ డబ్బులు అడగగా పేటీఎం ద్వారా ట్రాన్స్​ ఫర్​ చేస్తున్నామన్నారు.

ఇంతలోనే కారు స్టార్ట్​ చేసుకొని వెళ్తుండగా జితేందర్​ పరిగెత్తుతూ కారు డోర్​ పట్టుకుని వేలాడుతుండగా కారు స్పీడ్​ను పెంచారు. అంతేగాకుండా కారు లోపల ఉన్న వాళ్లు క్యాషియర్​ను కొట్టసాగారు. దాదాపు పావు కిలోమీటర్​ ఫలక్​నుమా బ్రిడ్జి వరకు కారులో ఈడ్చుకుంటూ వెళ్లి అక్కడ పడవేశారు. దీంతో క్యాషియర్​ జితేందర్​కి రక్తసిక్త గాయాలయ్యాయి. బాధితుడు పెట్రోల్​ బంకు యజమానితో పాటు ఫలక్​నుమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్​నుమా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News