ఔట్ డోర్ ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదు : రాచకొండ సీపీ
ఔట్ డోర్ ఈవెంట్లలో డీజే లకు అనుమతి లేదని రాచకొండ పోలీస్
దిశ, చైతన్యపురి : ఔట్ డోర్ ఈవెంట్లలో డీజే లకు అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. రానున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై బుధవారం రాచకొండ పరిధిలోని పబ్ లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్ లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు.
మాదకద్రవ్యాల సరఫరా చేసే ప్రాంతాలను పర్యవేక్షించి వేడుకలు జరిగేచోట అన్ని రకాల మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించాలన్నారు. నేరనివారణ పాయింట్‌గా ఉపయోగపడే స్నిఫర్ డాగ్‌లను ముఖ్యమైన ఈవెంట్‌లలో మోహరించాలన్నారు. రోడ్డుభద్రత, ఈవ్ టీజింగ్‌ల నివారణ, బాంబుదాడుల నిరోధం సంఘ వ్యతిరేక చర్యలను నిరోధించడంపై దృష్టి సారించి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితికి హాజరు కావడానికి ఎస్ఓటీ బృందాలు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక షీ టీమ్‌లు ఈవెంట్‌లకు హాజరై ఈవ్ టీజర్‌లపై నిఘా ఉంచాలన్నారు.
ఈవెంట్‌ను ఇంటిలోపల లేదా ఆరుబయట నిర్వహించాలా అనే దానితో సంబంధం లేకుండా అన్ని ఈవెంట్‌లు తప్పనిసరిగా పోలీసుల నుండి అనుమతి పొందాలన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్వహించబడే టికెటింగ్, నాన్‌టికెటింగ్ యొక్క అన్ని ఈవెంట్ నిర్వాహకులు కనీసం12 రోజుల ముందు తప్పనిసరిగా పోలీసుల అనుమతి మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ప్రమాణాలు ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్, 2013 ప్రకారం మొత్తం ఈవెంట్, పార్కింగ్ స్థలాలతో సహా ప్రాంగణాలు తప్పనిసరిగా సీసీటీవీ నిఘాలో ఉండాలని తదుపరి విశ్లేషణ కోసం బ్యాకప్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం మైనర్లకు మద్యం అందించకూడదని ఉల్లంఘించే వారిపై సరఫరాదారు తో సహా నిర్వాహకులపై కేసులు నమోదు చేయబడతాయన్నారు.
అసభ్యకరమైన డ్యాన్సులు ఇతర అభ్యంతరకర చర్యలను నిరోధించే బాధ్యత నిర్వాహకులకు పూర్తిగా ఉంటుందని ఉల్లంఘనలపై క్రిమినల్ చర్య తీసుకోబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, భువనగిరి, మహేశ్వరం డీసీపీలు పద్మజ, ప్రవీణ్ కుమార్, రాజేష్ చంద్ర, సునీత, ట్రాఫిక్ డీసీపీలు శ్రీనివాసులు, మల్లారెడ్డి, రోడ్ సేఫ్టీ డిసిపి మనోహర్, ఎస్ఓటీ మురళీధర్, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.