మెడికల్, నర్సింగ్ కాలేజీలకు గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
మెడికల్, నర్సింగ్ కాలేజీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...
దిశ, తెలంగాణ బ్యూరో: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రైవేట్ మెడికల్, నర్సింగ్ కళాశాలల యజమాన్యాల యూనియన్ ప్రతినిధులు బుధవారం తెలంగాణ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలల యజమాన్యాల నేతృత్వంలోని బృందం తమ పెండింగ్ స్కాలర్షిప్, బకాయిల గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్‌లోనే ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని కళాశాలల యజమాన్యాలు కోరాయి. ఇందుకు డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ పెండింగ్ స్కాలర్షిప్ బకాయిల చెల్లింపుల ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని భట్టి తెలిపారు.
పారదర్శకంగా ప్రతి కళాశాలకు బకాయిలను చెల్లిస్తామని, పైరవీలకు ఎలాంటి ఆస్కారం ఇవ్వమని భట్టి అన్నారు. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై భారం పడుతున్నదన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లింపు ప్రక్రియ మొదలుపెట్టి వ్యవస్థను స్క్రీమ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆలోచనతో కాంగ్రెస్ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. నాణ్యత కలిగిన విద్యను విద్యార్థులకు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.