సీఎం, మంత్రి శ్రీధర్ బాబుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

సీఎం, మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు..

Update: 2024-12-18 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డి .శ్రీధర్ బాబు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సభను తప్పుదోవ పట్టించారని వారిద్దరిపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభ్యులు మాట్లాడుతూ శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ నెల 17న మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డి తరపున బీఆర్ఎస్ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారన్నారు. డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)తయారు కాలేదని, వరల్డ్ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని చెప్పారు. వరల్డ్ బ్యాంకుకు రాష్ట్రప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 19న రూ.4100 కోట్ల సాయాన్ని అభ్యర్థించిందని, ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సందర్భంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కు 14 వేల కోట్లు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. ప్రపంచ బ్యాంక్ కు, కేంద్ర ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు పై డీపీఆర్ గురించి ఓ రకంగా, శాసన మండలి కి మరో రకంగా చెప్పి సీఎం, మంత్రి శ్రీధర్ బాబు సభను అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలి నియమావళి 168 (ఏ )కింద వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుల పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల కింద చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, సంజయ్, కాలేరు వెంకటేష్, చింత ప్రభాకర్, విజేయుడు, మాణిక్ రావు, రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.

ఫార్ములా-ఈ రేస్‌‌పై స్పీకర్ కు వినతి

ఫార్ములా-ఈ రేస్‌ వ్యవహారంలో అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వినతిపత్రం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఫార్ములా-ఈ రేస్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొద్దినెలలుగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పై అనేక నిరాధార ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరిగితే నిజానిజాలేంటో ప్రజలందరికీ తెలుస్తాయన్నారు.


Similar News