హుస్సేన్ సాగర్‌కు మరింత పర్యాటక శోభ.. సాగర తీరాన మరో పార్కు

హుస్సేసాగర్‌కు అదనపు పర్యాటక శోభ పెరగనుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ తీరా కొత్త సచివాలయం, బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, మరో వైపు అమరవీరుల స్మారక స్థూపం వంటివి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Update: 2023-08-05 02:34 GMT

దిశ, సిటీ బ్యూరో : హుస్సేసాగర్‌కు అదనపు పర్యాటక శోభ పెరగనుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ తీరా కొత్త సచివాలయం, బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహం, మరో వైపు అమరవీరుల స్మారక స్థూపం వంటివి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో జలవిహార్‌కు అతి సమీపంలోనే హెచ్ఎండీఏ రూ.40 కోట్ల వ్యయంతో మరో పార్కును ఏర్పాటు చేసింది. దాదాపు పనులు పూర్తయిన ఈ పార్కును త్వరలోనే ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాగర తీరాన భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేసిన వైపు నుంచి సాగర అందాలను వీక్షించేందుకు వీలుగా ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కులో వివిధ కోణాల్లో ఏర్పాటు చేసిన స్టీలు బ్రిడ్జిల పైనుంచి సాగర సొబగులను పర్యాటకులు వీక్షించేలా ఈ పార్కును డిజైనింగ్ చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జిల ద్వారా పర్యాటకులను వీలైంత ఎత్తుకు తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జిల పైనుంచి కొత్త సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్ బండ్‌లను పర్యాటకులు వీక్షించేలా ఈ బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొత్త సచివాలయం, అంబేడ్కర్ విగ్రహాలను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఈ డక్ పార్కు కూడా అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది.

క్యూఆర్ కోడ్‌తో చెట్ల వివరాలు..

ఈ పార్కులో సుమారు నాలుగు వేల పైచిలుకు రకరకాల చెట్లను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని ఔషధ మొక్కలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ చెట్లకు సంబంధించిన వివరాలు పర్యాటకులు తెలుసుకునేందుకు వీలుగా ప్రతి చెట్టుకు క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. ఈ పార్కును సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేయాలా? లేదా? అన్నది నిర్ణయించాల్సి ఉన్నట్లు సమాచారం.


Similar News