జార్ఖండ్‌లో ఎన్నికలు.. కాంగ్రెస్ నేతలకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు

జార్ఖండ్‌లో ఎన్నికలపై టీ కాంగ్రెస్ నేతలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు..

Update: 2024-11-01 16:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వచ్చిన ఇన్చార్జీలు నియోజకవర్గాన్ని వదిలి పెట్టవద్దని జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జ్, స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఏర్పాటు చేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలు, జార్ఖండ్ పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల సందర్భంగా జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సమావేశానికి హాజరైన ఎఐసిసి జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ తోపాటు ఏఐసిసి పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల్లో సీనియర్ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు రామ్ గడ్, బొకోరో అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు సైతం తాను తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి రాగానే జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు, రాష్ట్రంలోని 90 శాతం కాంగ్రెస్ సీనియర్ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. వీరితోపాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నేతలతోనూ సమావేశమైనట్టు వెల్లడించారు. స్థానికంగా కాంగ్రెస్ శ్రేణులు సమరోత్సహంతో ఉన్నారని , రామ్ గడ్, బొకోరో రెండు స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామని వారంతా గొప్ప ఉత్సాహంలో ఉన్నారని వివరించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విస్తృతంగా, సరైన పద్ధతుల్లో ప్రచారం నిర్వహించాలని, సోషల్ మీడియాను మరింత విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ నేతలు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ నేతలు ఇతర నాయకులను సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలోనే మకాం వేయాలని తెలిపారు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరితోను, కాంగ్రెస్ కూటమిలోని ఇతర నేతలతోనూ చర్చించాలని వారంతా ప్రచారంలో పాల్గొనేలా అవసరమైన చర్యలు వెను వెంటనే చేపట్టాలన్నారు.

తాము పరిశీలకులుగా స్థానిక నేతలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మా బాధ్యతగా ఏ కార్యక్రమం నిర్వహించాలంటే ఆ కార్యక్రమం చేపట్టేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. దేశంలో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని మనందరికీ తెలుసని అన్నారు. ఎఐసిసి సెక్రటరీ జనరల్ కేసీ వేణుగోపాల్ దేశంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళ నుంచి శ్రీనగర్ వరకు ఒక్కో రోజు ఒక్కో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని, నిన్నటి రోజు దీపావళి పండుగ అయినప్పటికీ వారు తెలంగాణలో సమావేశం నిర్వహించిన విషయాన్ని సమావేశానికి హాజరైన నేతలకు గుర్తు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పెద్దలు చేస్తున్న శ్రమను స్ఫూర్తిగా తీసుకొని వారి కన్నా ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉద్బోధించారు. జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే మనమంతా గెలిచినట్టేనని, ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు ఇతర అనుబంధ విభాగాలను వెను వెంటనే సమావేశపరచి ఎన్నికల పనిలో నిమగ్నం అయ్యేలా కార్యాచరణ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ వార్ రూం నుంచి సమాచారం అందగానే ఆ సందేశాన్ని తీసుకొని నియోజకవర్గాల్లో వెంటనే అమలు చేస్తే కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు సునాయాసం అవుతుంది అన్నారు. ఎన్నికలు పూర్తయ్య వరకు తాను జార్ఖండ్ లోనే మకాం వేస్తానని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్దలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశానికి హాజరైన నేతలకు భరోసా ఇచ్చారు.

మేనిఫెస్టో‌పై కసరత్తు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విడుదల చేయాల్సిన మేనిఫెస్టో‌పై శుక్రవారం సాయంత్రం రాంచీలో Aicc genral secretry కేసీ వేణుగోపాల్, ఎన్నికల ఇంచార్జ్ భట్టి విక్రమార్క , ఝార్ఖండ్ పిసిసి అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం అహమద్ మీర్ సాబ్ , గౌరవ్, బి కే హరీప్రసాద్‌, గులాం అహమద్ మీర్, ఎలెక్షన్ ఇన్చార్జి రామేశ్వర రావు తదితరులు మేనిఫెస్టో అంశాలను కూలంకషంగా చర్చించారు.


Similar News