సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. 15 రోజుల పాటు బూత్ కమిటీల నియామకం

సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది..

Update: 2024-11-01 16:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బూత్‌ స్థాయి నుంచి మొదలుకుని రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ ద్వారా నియామకం జరగనుంది. అందులో భాగంగా పార్టీ ఈ కసరత్తును ముమ్మరం చేసింది. హైకమాండ్ ఆదేశాల మేరకు ఈనెల 16 నుంచి 30వ తేదీ వరకు బూత్ కమిటీల నియామకం పూర్తిచేయాలని భావిస్తోంది. నవంబర్ 27న రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అలాగే వచ్చే నెలలో జిల్లాస్థాయి కార్యశాలలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. అలా అయితేనే పార్టీని బలోపేతం చేయొచ్చని నిర్ణయం తీసుకుంది. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను హైకమాండ్ నియమించింది. డిసెంబర్‌ నెలాఖరున రాష్ట్ర అధ్యక్ష పదవికి, జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే అవకాశముంది.

బీజేపీ.. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో నెలకొంది. అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ముఖ్య నేతలంతా లాబీయింగ్‌ చేస్తున్నారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే జాతీయ అధ్యక్షుడి పదవీకాలం ముగిసింది. కానీ ఎలక్షన్ నేపథ్యంలో పొడిగించారు. ప్రస్తుతం పార్టీ.. ప్రధానంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై దృష్టిసారిస్తోంది. వాటితో పాటు సంస్థాగత ఎన్నికలపైనా దృష్టి పెడుతోంది. దీనికోసం జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌‌ను హైకమాండ్ నియమించింది. అలాగే రాష్ట్రానికి సంబంధించి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణను నియమించింది.

జాతీయ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లక్ష్మణ్‌ అన్ని రాష్ర్టాలను చుట్టేస్తున్నారు. సంస్థాగత ఎన్నికలపై నిర్వహించే సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో యెండల లక్ష్మీనారాయణ నిమగ్నమయ్యారు. ఇటీవలే ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 16 నుంచి 30వరకు బూత్‌ కమిటీలను పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బూత్ కమిటీలు పూర్తయిన తరువాత ఢిల్లీలో అన్ని రాస్ట్రాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో అధిష్టానం సమావేశంకానుంది. ఈ సమావేశంలో మండల, జిల్లా, రాష్ర్ట కమిటీలపై మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నవంబర్‌ 21న జాతీయ, 27న రాష్ట్ర, డిసెంబర్‌ 20న జిల్లాస్థాయిలో కార్యశాలలను నిర్వహించనున్నారు. మండల, జిల్లా కమిటీల నిర్మాణం పూర్తయ్యాక రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబర్ చివరికల్లా అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తవుతుందని సమాచారం. ఆ తరువాత జనవరిలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.


Similar News