జీహెచ్ఎమ్‌సీలో ఏఐ ఆధారిత అటెండెన్స్

ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చుట్టూ తిరుగుతోంది. ప్రతి దాన్ని ఏఐ ఆధారంగా మార్పులు చేయాలనే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి బల్దియా సిద్ధమైంది.

Update: 2024-09-21 02:44 GMT

దిశ, సిటీబ్యూరో : ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) చుట్టూ తిరుగుతోంది. ప్రతి దాన్ని ఏఐ ఆధారంగా మార్పులు చేయాలనే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి బల్దియా సిద్ధమైంది. ఏఐ ఆధారిత అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయించింది. హెడ్ ఆఫీస్‌లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం అమలుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ముందుగా హెడ్ ఆఫీస్ లో అమలు చేసిన తర్వాత జోనల్, సర్కిల్ కార్యాలయంలో అమలు చేయాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా శుక్రవారం 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది (రెగ్యులర్, ఔట్ సోర్సింగ్) ముఖాన్ని సంబంధిత మొబైల్ బేస్డ్ యాప్‌లో ఐటీ విభాగం అధికారులు క్యాప్చర్ చేసి నమోదు చేశారు. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నారు.

అడ్వర్‌టైజ్‌మెంట్ అండ్ పబ్లిసిటీ, ఆడిట్/అకౌంట్స్ సెక్షన్, సీపీఆర్ఓ సెక్షన్, ఎలక్షన్ బ్రాంచ్, ఎస్టేట్ ఆఫీస్, ఫైనాన్స్ అకౌంట్స్ సెక్షన్, జనరల్ టాక్సేషన్, లేబర్ వెల్ఫేర్ సెక్షన్, ల్యాండ్ ఎక్విజేషన్, లీగల్ సెక్షన్ అండ్ మున్సిపల్ కోర్టు, సెక్రెటరీ సెక్షన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కమిషనర్ ఆఫీస్, వెటర్నరీ, విజిలెన్స్ సెక్షన్‌ల అధికారులు, సిబ్బంది ముఖాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ నెల 21న శనివారం చీఫ్ ఇంజినీర్ ప్రాజెక్ట్స్, ఈ ఈ ఐపీపీ-VIII, ఎలక్ట్రికల్ డివిజన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ (మెయింటెనెన్స్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జేఎన్ఎన్‌ యూఆర్ఎం-I, II, III, ఎస్ఈ హౌసింగ్ I, II, ఎస్ఈ ప్రాజెక్ట్స్, ఎస్ఈ ఎస్ఎన్డీపీ I, II, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్, సౌత్‌జోన్ ప్రాజెక్టు డివిజన్ I, II, III, సూపరింటెండింగ్ ఇంజినీర్ డిజైన్స్, సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆఫీస్ I, II, వెస్ట్ జోన్ ప్రాజెక్టు డివిజన్ I, II విభాగాల అధికారులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో ఫొటో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సోమవారం 23న మిగతా విభాగాల వారి ఫొటో క్యాప్చర్ చేయనున్నారు. చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ అండ్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్, హెల్త్ సెక్షన్, ఫుడ్ సేఫ్టీ వింగ్, హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్, లైసెన్స్ సెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా, యాంటీ మస్కిటో స్కీం, స్పోర్ట్స్, టౌన్ ప్లానింగ్, ట్రాన్స్ పోర్ట్, అర్బన్ బయోడైవర్సిటీ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగాల అధికారులు, సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌కు నమోదు చేయనున్నారు.

కచ్చితత్వంతో కూడిన హాజరు..

ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్ 2024 నుంచి అమలు చేస్తున్నారు. దీంతో పారదర్శక, కచ్చితత్వంతో కూడిన హాజరు నమోదవుతుంది. దీనిలో ఉద్యోగి కార్యాలయానికి వచ్చిన సమయం, కార్యాలయం నుంచి వెళ్లిన సమయాలతో సహా నమోదవుతుంది. అందుకోసం రెండు ప్రవేశ ద్వారాల వద్ద క్యాప్చర్ చేసే కెమెరాలు కమిషనర్ ఆమ్రపాలి కాటా ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. అమర్చిన కెమెరాలో ఫొటో క్యాప్చర్ చేసి ఎంప్లాయ్ ఐడి నెంబర్ అటెండెన్స్ సమయం నమోదు అవుతుంది. గతంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఉద్యోగుల హాజరు పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆకస్మిక తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు పరిస్థితిని మెరుగుపరచడానికి కమిషనర్ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను అమలు చేయాలని నిర్ణయించి అమలుకు శ్రీకారం చుట్టారు.

త్వరలో జోన్లు, సర్కిళ్లలో..

ఫేస్ రికగ్నిషన్ సిస్టంను హైడ్ ఆఫీసులలో పూర్తయిన తర్వాత జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ అమలు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు పర్మినెంట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి ఏఐ ఆధారిత అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ అటెండెన్స్‌తో పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.


Similar News