బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్..

వచ్చే జీతం సరిపోక ఖరీదైన బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యింది ఐదుగురు సభ్యుల ముఠా.

Update: 2024-07-08 16:13 GMT

దిశ, శేరిలింగంపల్లి : వచ్చే జీతం సరిపోక ఖరీదైన బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యింది ఐదుగురు సభ్యుల ముఠా. వీరి వద్ద నుంచి రూ.35 లక్షల విలువ చేసే 16 బైక్ లను సీజ్ చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్ గోదావరి జిల్లా తణుకు మండల కేంద్రానికి చెందిన దేవ కిషోర్ (20) నగరానికి వచ్చి కొండాపూర్ లో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కడియాల వీర వెంకట సత్యనారాయణ (21) కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరితో పాటు కృష్ణా జిల్లా కైకలూరు గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలే దిలీప్ (19), ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఈస్ట్ గోదావరి ప్రాంతానికి చెందిన మైనర్, ఉడ్ వర్క్ చేస్తున్న విశాఖపట్నంకు చెందిన మరో మైనర్ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు.

వీరు ఇంటి ముందు, హాస్టల్ ఎదుట, ఆఫీసుల ముందు పార్క్ చేసిన విలువైన బైక్ లను టార్గెట్ చేసుకుని కెమెరాలు లేని చోట రాత్రి వేళల్లో బైక్ ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. హ్యాండిల్ లాక్ లను విరగొట్టి మరో బైక్ సహాయంతో వారు తమ స్థావరానికి తరలించేవారు. దొంగతనం చేసిన బైక్ లను రాఘవేంద్ర కాలనీలో ఓ సెల్లార్ లో ఈ బైక్ లను భద్రపరిచారు. వాటికి ప్రధాన సూత్రధారి దేవకిషర్ సహాయంతో డూప్లికేట్ మాస్టర్ కీస్ తయారీ చేసేవారు. ఇలా ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బైకు చోరీలకు పాల్పడింది ఈ గ్యాంగ్. దొంగతనం చేసిన బైక్ లను ఆంధ్రాలో విక్రయించేందుకు పార్టీలతో బేరం కుదుర్చుకుంది ఈ ముఠా. అయితే స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన గచ్చిబౌలి సీఐ ఆంజనేయులు, డీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్సై నరసింహులు, ఏఎస్ ఐ నర్సింగరావు ఇతర పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.


Similar News