భాగ్యనగరానికి నూతన కాంతులు.. రూ.3 కోట్లతో 15,550 ఎల్ఈడీ లైట్లు

గ్రేటర్ హైదరాబాద్‌లో వెలుగులు నింపాలని జీహెచ్ఎంసీ ధ్యేయంగా పెట్టుకుంది. ప్రతి కాలనీలో వెలుగులు విరజిమ్మే విధంగా సంప్రదాయ లైట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది.

Update: 2024-09-17 03:01 GMT

దిశ, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో వెలుగులు నింపాలని జీహెచ్ఎంసీ ధ్యేయంగా పెట్టుకుంది. ప్రతి కాలనీలో వెలుగులు విరజిమ్మే విధంగా సంప్రదాయ లైట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే రూ.3 కోట్లతో 30 కాలనీల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. గతంలో వీధి దీపాల నిర్వహణ జీహెచ్‌ఎంసీకి సమస్యగా ఉండేది. నిర్వహణ, విద్యుత్‌ వినియోగంతో పాటు బిల్లులు భారంగానే ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 2018లో కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్ఎల్) పబ్లిక్‌ రంగ సంస్థ (ఎన్‌టీపీసీ)జాయింట్‌ వెంచర్‌తో పని చేస్తున్నది. అయితే సంప్రదాయ విద్యుద్దీపాలతో విద్యుత్ వినియోగం తో పాటు బిల్లులు సైతం అధికంగానే ఖర్చయ్యేది. దీంతో పాటు కర్బన ఉద్గారాలు అధికంగా విడుదలయ్యేది. కానీ ఎల్ఈడీ ఏర్పాటు చేసిన తర్వాత బిల్లులు తగ్గడంతో పాటు కాలుష్యం తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

గ్రేటర్‌లో 5.10 లక్షల లైట్లు

జీహెచ్ఎంసీ 30సర్కిళ్ల పరిధిలో 5.10 లక్షల వీధి దీపాలు ఉన్నాయి. వీటిని 25వేల సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టం(సీసీఎంఎస్) డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశారు. దీంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎన్ని లైట్లు, ఎంత శాతం వెలుగుతున్నాయనే స‌మాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశముంది. సంప్రదాయ వీధి దీపాల నిర్వహణలో భాగంగా ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చయ్యేది. ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసిన తర్వాత రూ.100 కోట్లకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఏడేళ్ల పాటు ఎల్ఈడీ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్ఎల్ చేప‌డుతోందని 2018లో జీహెచ్ఎంసీ ప్రకటించింది. విద్యుత్ బిల్లుల ఆదా ద్వారా ల‌భించిన నిధుల‌నే ఈఈఎస్ఎల్‌కు జీహెచ్ఎంసీ చెల్లించాలని నిర్ణయించింది. నేష‌న‌ల్ లైటింగ్ కోడ్ (ఎన్‌ఎల్‌సీ) ప్రకారం అన్ని వీధుల‌కు స‌రిప‌డా విద్యుత్ కాంతి ఉండేలా చూడ‌టం జ‌రుగుతుంది.

రూ.3 కోట్లతో..

గ్రేటర్‌లో రూ.3కోట్లతో 30 కాలనీల్లో కొత్తగా 15,550 వీధి దీపాలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీటికి సంబంధించిన విద్యుత్ స్తంభాలు వేయడంతో పాటు వాటికి వైరింగ్ సిద్ధంగా చేశారు. ఇక లైట్లను బిగించడమే తరువాయిగా మిగిలింది. ఈ కొత్త లైట్లను ఎల్బీనగర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో ఏర్పాటు చేయనున్నారు. 2021-22 లో 4066 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయగా, 2022-23 లో 4 వేలకు పైగా కొత్తగా స్తంభాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.


Similar News