HYD : కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డ్ సజీవ దహనం
స్వప్నలోక్ కాంప్లెక్స్ విషాదాన్ని మరిచిపోక ముందే హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది.
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : స్వప్నలోక్ కాంప్లెక్స్ విషాదాన్ని మరిచిపోక ముందే హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది. దీంట్లో సెక్యూరిటీ గార్డు సజీవ దహనమయ్యాడు. ఈ దుర్ఘటన శనివారం తెల్లవారుఝామున కింగ్ కోఠి రోడ్డు బొగ్గులకుంటలోని వినాయక ఆటో గ్యారేజిలో జరిగింది. వినాయక ఆటో గ్యారేజీ నిర్వాహకులు ఎప్పటిలానే శుక్రవారం రాత్రి పనులు ముగిసిన తరువాత షెడ్డుకు తాళం వేసి వెళ్లారు. ఆ సమయంలో షెడ్డు ముందు ఏడు కార్లు ఉన్నాయి. వీటిలోని ఓ బెంజ్ కారులో సెక్యూరిటీ గార్డ్ సంతోష్ (42) నిద్ర పోయాడు.
తెల్లవారుఝాము 4 గంటల సమయంలో ఈ కారులో ఎగిసిన మంటలు మిగితా కార్లకు వ్యాపించాయి. కార్లలోని బ్యాటరీలు పెద్ద పెద్ద శబ్దాలు వెలువరిస్తూ పేలిపోవటంతో స్థానికులు అక్కడికి చేరుకొని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. దోమలు రాకుండా ఉండటానికి సెక్యూరిటీ గార్డు సంతోష్ తాను పడుకున్న కారులో వెలిగించి పెట్టిన మస్కిటో కాయిల్ వల్ల ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. సంతోష్ మద్యం సేవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అందుకే కారులో మంటలు చెలరేగినా అతను మేలుకోలేక పోయాడని భావిస్తున్నారు. ప్రమాదంలో మొత్తం ఏడు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సెక్యూరిటీ గార్డ్ సజీవ దహనమయ్యాడు.