Telangana Rains : ఎల్ఎండీకి భారీగా పెరిగిన ఇన్ ఫ్లో.. 6 గేట్లు ఎత్తివేత
ఎల్ఎండి జలా శయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి జలా శయానికి ఎగువ ప్రాంతాలతో పాటు మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీ అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తే సమయంలో అధికారులు రిజర్వాయర్ దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే విధంగా సైరన్ మోగించారు.
ప్రాజెక్టులోకి భారీగా వరద..
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎల్ఎండి రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతాలతో పాటు మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి ఎల్ఎండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి దాదాపు 50 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం లోని నదుల నుంచి దాదాపు 30 వేల క్యూసెక్కులు వస్తుండగా, మిడ్ మానేరు జలాశయం నుంచి దాదాపు 20 వేల క్యూసెక్కుల వరకు నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ఎల్ఎండిలో 24 టీఎంసీల నీటి నిల్వకు గాను 22 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆరు గేట్లు ఎత్తిన అధికారులు..
ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో అధికంగా ఉండడంతో మంగళవారం ఉదయం తొమ్మిది గంటల తర్వాత ప్రాజెక్టు ఆరు గేట్లు దాదాపు 2 ఫీట్ల మేర ఎత్తి దాదాపు 18 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఏఈలు కాళిదాసు, వంశీ కోరారు.