Hot News: కాంగ్రెస్‌లో కొత్త హుషారు.. బీఆర్ఎస్ బేజారు

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది.

Update: 2024-11-23 02:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుందని, ఆయన నిర్ణయమే ఫైనల్ అని తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జోష్‌లో ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ నేతలు డీలా పడ్డారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో ఆ పార్టీ షాక్‌కు గురైంది. దీనిపై తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్ బెంచ్ తీర్పుతో కాంగ్రెస్‌లోకి మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారన్నారు. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికరంగా మారినా తాజాగా డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం పెరిగింది.

ఆ మూడు జిల్లాల నుంచి చేరికలు

హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటుగా మరికొందరు ఎమ్మెల్సీలు కూడా చేరుతారని చెబుతున్నారు. గతంలో కొందరితో సంప్రదింపులు జరిపినప్పుడు వివిధ కారణాలతో వారు ముందుకు రాలేదని, కానీ ఇప్పుడు కోర్టు తీర్పుతో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని తేలడంతో పార్టీ మారాలనుకుంటున్న వారు మరోసారి ఆలోచనలో పడ్డారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడం, ఆ తరువాత ఎమ్మెల్యేలు, గులాబీ పార్టీలో కీలకమైన నేతలుగా ఉన్న కేశవరావు, పోచారం లాంటి వారు పార్టీ మారడంతో ఒక్క సారిగా పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఆ తరువాత సింగిల్ బెంచ్ తీర్పు,రాజకీయ పరిణామాలు మారడంతో కాంగ్రెస్‌లో చేరికలు నెమ్మదించాయి. ఇకపై చేరికల వేగం పెరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంచనా వేస్తున్నారు.

బీఆర్ఎస్‌పై విమర్శలు

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా వ్యవహరించడం సరికాదని విమర్శలు వెల్లువెత్తాయి. ఆనాడు 40వరకు ఎమ్మెుల్యేలను కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, ఇతర పార్టీల ఆ పార్టీలో చేర్చుకున్నారు. కానీ, వారిలో ఎవ్వరిపైనా అనర్హత వేటు పడలేదు.కానీ ఇప్పుడు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించడం నైతికంగా సరికాదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తమకు మొదటి నుంచి చట్టం, న్యాయస్థానాలపై గౌరవం ఉందని, ఇప్పుడుఅనుకూలంగా తీర్పు వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత తీర్పు ఆధారంగా ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని వేచిచూడగా, ఎమ్మెల్యేలపైనే చర్యలకు ఆదేశాలు రాకపోవడంతో ఊపరిపీల్చుకున్నారు.

గులాబీకి తప్పని నిరాశ

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ షాక్‌కు గురైంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు రాష్ట్ర స్పీకర్‌కు ఆదేశాలు ఇస్తుందని, టైం ఫ్రేమ్ ఇస్తుందని ఆశించినా వారికి నిరాశే ఎదురైంది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ మారిన వారిపై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉన్నది. అందుకే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతోందని తెలుస్తోంది. అనర్హత పిటిషన్‌లపై గతంలో ఢిల్లికి వెళ్లినప్పుడు న్యాయవాదితో మాట్లాడామని స్వయంగా కేటీఆర్ వెల్లడించారు. సుప్రీం సీనియర్ న్యాయమూర్తిని సంప్రదించినట్లు గుర్తుచేశారు. తాజాగా డివిజన్ బెంచ్ తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News