CM Revanth Reddy: స్థానిక ఎన్నికలపై రేవంత్ నజర్..! ఆ రోజు నుంచి జిల్లాల టూర్
జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గడిచిన ఏడాదిలో పాలనపరంగా, రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు. అందుకు కోసం నేరుగా రంగంలోకి దిగి జిల్లాల టూర్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్‌లో ఆయన పర్యటించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని 26న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్నారు. ఆ మరుసటి రోజు నుంచి జిల్లాల బాట పట్టనున్నట్టు తెలిసింది.
లబ్ధిదారులతో సమావేశం!
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల్లో యాత్రలు చేసేందుకు రేవంత్‌కు సమయం దొరకలేదు. కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఆ తర్వాత పాలనపై పట్టుసాధించేందుకు శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేందుకే టైం సరిపోయింది. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. దీనికి తోడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం భావిస్తున్నారు. అందుకోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగి, జిల్లాల్లో లబ్ధిదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దానితో పాటు జిల్లాల్లోని సీనియర్ లీడర్లు, కేడర్‌తోనూ రేవంత్ భేటీ అవుతారని తెలిసింది.
16 నుంచి మంత్రులు
రైతుభరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రులనూ రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆయన కన్నా ముందే మినిస్టర్లు జిల్లాల్లో పర్యటించే విధంగా నేడు జరిగే కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నట్టు టాక్. ఈ నెల 16 నుంచి వచ్చేనెల 15 వరకు ఇన్‌చార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని, పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని నేటి మంత్రివర్గ సమావేశంలో ఆదేశించనున్నట్టు తెలిసింది.
గత అనుభవంతో అలర్ట్
రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి అనుకున్నంత పొలిటికల్ మైలేజ్ రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకేసారి రూ.21 వేల కోట్ల ఖర్చుతో రుణమాఫీ చేసినా ప్రచారంలో వెనకబడినట్టు సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రైతుభరోసా, రైతుకూలీలకు ఆర్థిక సాయం పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు స్వయంగా సీఎం, మినిస్టర్ల ప్రచార కార్యక్రమాలను రూపొందించినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. పాలన వ్యవహారాలకు ఇబ్బంది కలగకుండా, టూర్ షెడ్యూల్ తయారు చేసినట్టు టాక్. రెగ్యూలర్‌గా సెక్రెటేరియట్‌కు వచ్చి, తమ శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రులు రివ్యూలు చేస్తూనే, జిల్లా యాత్రలకు ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఇన్‌చార్జి మంత్రులపై రేవంత్ గుస్సా!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రులను నియమించింది. వారికి కేటాయించిన జిల్లాల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార బాధ్యతలను అప్పగించారు. కానీ చాలా మంది మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించడం లేదని, అక్కడ ఉన్న గ్రూపు తగాదాలను పరిష్కరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పార్టీలోని గ్రూపు తగాదాల ఇష్యూలు హైదరాబాద్ వరకు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటి నుంచి మంత్రులు జిల్లాల్లో పార్టీ వ్యవహారాలపై తప్పనిసరిగా ఫోకస్ పెట్టాలని నేటి కేబినెట్ భేటీలో మినిస్టర్లకు సీఎం క్లాస్ ఇచ్చే అవకాశమున్నది. దానితో పాటుగా త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేలా మంత్రులు చొరవ చూపాలని ఆదేశించనున్నట్టు తెలిసింది.