దుందుభీ వాగులో తోడేళ్లు.. దర్జాగా ఇసుక అక్రమ రవాణా

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని దుందుభీ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు..

Update: 2025-01-04 02:57 GMT

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల పరిధిలోని దుందుభీ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. కొద్ది కాలంగా తిరిగి ఈ దందా జోరందుకున్నది. డిండి వాగు పరిసర గ్రామాలైన మోల్గర, జప్తిసదగోడు, పెద్దాపూర్, దాసర్లపల్లి నుంచి రాత్రి వేళల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. వాగు నుంచి ఇసుక తోడేందుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా, దుందిభీని తోడేస్తున్నారు. దుందుభీ వాగు నుంచి సమీప గ్రామాలలో గల వ్యవసాయ పొలాల వద్ద గుట్టలుగా ఇసుకను నిలువ చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వహించడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజమైన గృహ నిర్మాణం చేసే వారికి సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవని, కానీ, రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణా చేసే వారికి అనుమతులు ఎక్కడివని ప్రజలు అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒక ఇసుక ట్రాక్టర్ కు రూ.5వేల వరకు తీసుకుంటూ, అచ్చంపేట, అమ్రాబాద్, పదర, తెలకపల్లి, నాగర్ కర్నూల్ పట్టణాలకు నిత్యం వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్ల ట్రిప్పులను తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు అంటున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు..?

రాత్రి వేళల్లో తరలించే అక్రమ ఇసుక రవాణా సంబంధిత అందరు అధికారులకు తెలుసని, మామూళ్ల మత్తులో మునిగారని ఆయా గ్రామాల, ప్రజలు స్థానిక రైతులు చేస్తున్నారు. ఇసుక బకాసురులు అధికారులు నాయకులు కుమ్మక్కై అందరూ కలిసే ఈ అక్రమ రవాణా చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

వాహనాల డాక్యుమెంట్లు, నెంబర్ ప్లేట్లు ఉండవా..?

ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు ఎలాంటి పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, ఇన్సూరెన్స్ లు కనీసం నెంబర్ ప్లేట్లు కూడా ఉండవని సమీప గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. రాత్రివేళలో వాహనాదారులు ఈ రోడ్డు ద్వారా ప్రయాణించాలంటే నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక ట్రాక్టర్లు అతివేగంతో నడుపుతున్నారని, ప్రమాద సమయంలో ట్రాక్టర్లను గుర్తించాలంటే ఎలాంటి గుర్తింపు ఉండదని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లే రైతులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలు ఉట్టివేనా..?

గత రెండు నెలల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వరరావు మండలంలోని దేవదారు కుంట గ్రామంలో కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి వాహనాలకు సరైన పత్రాలు, నెంబర్లు ఉండాలని, గ్రామాల్లో ఉండే ప్రజలందరికీ అవగాహన కల్పించారు. కానీ ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల కు అవేవి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని అక్రమ ఇసుక రవాణాను అరికట్టుతామని, ఆయా గ్రామాల్లో ఉన్న అక్రమ డంపులను ప్రభుత్వ ప్రయోజనాలకు వాడుకుంటామనే మాటలన్నీ ఉట్టివేనా.? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒకరోజు ఎవరైనా అధికారులకు సమాచారమందిస్తే ఇసుకడంపులు సీజ్ చేశామని చెబుతున్నా, మరుసటిరోజే ఇసుక డంపులన్నీ మాయమైతున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారా అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు చర్యలు చేపట్టి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Similar News