Hot News: ‘ఇందిరమ్మ ఇండ్ల’ ఎంపిక కలెక్టర్లదే..? డెమోగ్రఫిక్‌ ఆధారంగా లబ్ధిదారుల సెలక్షన్!

కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో.. అక్కడ తాము విఫలం కావొద్దని రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది.

Update: 2024-08-07 02:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో.. అక్కడ తాము విఫలం కావొద్దని రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. నీళ్లు, నిధుల విషయంలో అదే ఎత్తుగడను అవలంభించిన రేవంత్ సర్కారు..తాజాగా ఇండ్ల విషయంలోనూ అదే పంథాను పాటించాలని అనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ప్రతి అడుగునూ పక్కాగా వేస్తున్నది. ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకంలో కలెక్టర్లకే సర్వాధికారాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. లబ్ధిదారుల ఎంపికలో ఎగ్జిగ్యూటివ్‌ అధికారాలన్నీ వారికే ఇవ్వాలని తెలంగాణ హౌసింగ్‌ శాఖ ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిబంధనలు రూపొందిస్తున్నారు.

డెమోగ్రఫిక్‌ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక

డెమోగ్రఫిక్‌ ఏరియా వైజ్‌గా ‘ఇందిరమ్మ ఇండ్ల’ లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్లు చేసే విధంగా నిబంధనలు రూపకల్పన చేయాలని కసరత్తులు తీవ్రంగా సాగుతున్నాయి. నిబంధనలు ప్రాథమికంగా రూపొందించిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేషీలకు పంపిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆయా నిబంధనలపై వారి ఆమోదం తీసుకున్నాక, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పున:రూపకల్పన చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇదీ డెమోగ్రఫిక్ పద్ధతి..

సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ గృహ నిర్మాణ పథకంలో అయినా ఎస్సీ, ఎస్టీలకు 50 % రిజర్వేషన్‌ కోటా కల్పించడం సహజమని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకాయన విశ్వసనీయంగా ‘దిశ’కు తెలిపారు. అయితే, ఈ పథకంలో మాత్రం ఒక నూతన విధానాన్ని ముందుకు తీసుకొచ్చినట్టు తెలిసింది. డెమోగ్రఫిక్‌ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 శాతానికి పైగా గిరిజనులే నివసిస్తారు. అందుచేత, అక్కడ 1 ఆఫ్‌ 70 చట్టం అమలులో ఉంటుంది. గిరిజనేతరుల చేతుల్లో భూమి ఉండేందుకు ఆస్కారం ఉండదు. ఒక వేళ ఉన్నా.. 1960కి పూర్వం ఉన్న వారికే సొంత స్థలం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ గిరిజనేతురులకు వారి జనాభా ఆధారంగా ఇవ్వడం కుదరదు.

దాంతో పాటు హైదరాబాద్‌లోని పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో అధికంగా ముస్లిం వర్గానికి చెందిన వారే ఉంటారు. ఇక్కడ ముస్లిమేతర పేదలు సొంత స్థలం కలిగి ఉండేందుకు మెజారిటీగా అవకాశం ఉండదు. రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో దళితులు సొంత స్థలం కలిగి ఉండేందుకు చాన్స్‌ చాలా తక్కువగా ఉంటుందని ఆఫీసర్లు భావించారు. ఈ రకమైన అంశాలను స్థానిక కలెక్టర్లు సముతుల్యం చేయనున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా కట్టే ఇండ్లలో జనాభా ప్రాతిపదికన ఇండ్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఎక్కడ ఎంత ఇచ్చామో.. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కలెక్టర్లు.. లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుందని హౌసింగ్‌ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సొంత స్థలం ఎంతన్న దానిపై క్లారిటీ రాలే!

‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకానికి అర్హులవ్వాలంటే.. వారికి ఎంత స్థలం ఇద్దామన్న విషయంపై ప్రభుత్వం క్లారిటీతో లేనట్టు తెలిసింది. పల్లెల్లో ఎంత స్థలముంటే ఎంపిక చేయాలి.. పట్టణాల్లో ఎంత జాగా ఉండాలన్న దానిపై స్పష్టత లభించలేదు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఇండ్లు నిరుపేదలు 125 గజాల స్థలం కలిగి ఉంటారా? అన్న విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. ప్రభుత్వం విధానపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

హౌసింగ్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించాలనుకుంటున్న అంశాలు:

1. సొంత స్థలం కలిగి ఉండి... దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి.

2. సామాజిక, ఆర్థిక సర్వే-2011లో ఇండ్లు లేని వారుగా అర్హుల పేరు నమోదై ఉండాలి.

3. సొంత స్థలం దాని పూర్వ వివరాలు ఆన్‌లైన్‌లో పక్కాగా కలిగి ఉండాలి.

4. ఇదివరకు ప్రభుత్వం నుంచి ఏ గృహ నిర్మాణానికి లబ్ధిదారులై ఉండకూడదు.

5. స్థానికంగా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని సహేతుక వివరణ ఇవ్వాలి

6. గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రకటించి.. ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడాలి.

7. సొంత స్థలం ఉన్న వారికి ఆన్‌లైన్‌లో స్థలాన్ని ట్యాగ్‌ చేసే విధంగా ఉండాలి.

Tags:    

Similar News