HOT New: కేసీఆర్.. దాగుడుమూతలు! ప్రతిపక్ష నేతగా అన్ని కార్యక్రమాలకు గైర్హాజరు

ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాకుండా కేసీఆర్ దాగుడుమూతలు ఆడుతున్నారా?

Update: 2024-08-16 02:31 GMT
HOT New: కేసీఆర్.. దాగుడుమూతలు!  ప్రతిపక్ష నేతగా అన్ని కార్యక్రమాలకు గైర్హాజరు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతిపక్ష నేతగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాకుండా కేసీఆర్ దాగుడుమూతలు ఆడుతున్నారా? ప్రతిపక్ష బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? కేవలం ప్రతిపక్ష హోదా కోసమే ఇలా చేస్తున్నారా? ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో.. లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవిని కేసీఆర్ చేపట్టారు. ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో తను చూపెడుతానని రిజల్ట్ వచ్చిన తరువాత జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాల్లో ఆయన ప్రకటించారు. కానీ.. అప్పటి నుంచి ఇంతవరకు కేసీఆర్ ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఇంతవరకు అసెంబ్లీలో జరిగిన ఏ చర్చలోనూ పాల్గొనలేదు. సభకు వచ్చి.. చర్చలో పాల్గొని సూచనలు ఇవ్వాలని స్వయంగా సభా నాయకుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు కోరినా కేసీఆర్ పట్టించుకోలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే చుట్టపుచూపుగా వచ్చి వెళ్లారు.

అన్నింటికీ దూరం..

మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్షనేత హోదాలో ఆయన ఇంతవరకు ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు. అసెంబ్లీ సమావేశాలతోపాటు రాజ్యాంగ పరమైన కార్యక్రమాలకు సైతం డుమ్మాకొట్టారు. సభా మర్యాదల ప్రకారం స్పీకర్ ఎన్నిక తరువాత సభ నాయకుడు, ప్రతిపక్షనేత ఇద్దరు కలిసి స్పీకర్‌గా ఎన్నికైన ఎమ్మెల్యేను సభాపతి చైర్‌లో కూర్చోబెట్టే సంప్రదాయం ఉంది. కానీ.. దానిని కూడా కేసీఆర్ పాటించలేదని విమర్శలు ఉన్నాయి. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు వెళ్లలేదు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధిగా జెండా ఎగురవేస్తుంటారు.

కానీ.. కేసీఆర్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. ఎమ్మెల్యేగా గజ్వేల్ క్యాంపు ఆఫీసుకు వెళ్లి జెండా ఎగురవేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జాతీయ జెండాకు వందనం చేయాలంటే సీఎం పదవి మాత్రమే కావాలా అని సెటైర్లు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాజ్ భవన్‌లో అన్ని రాజకీయ పార్టీలు, నగర ప్రముఖులకు తేనీటి విందు ఇవ్వడం సంప్రదాయం. గురువారం జరిగిన రాజ్యాంగ పరమైన కార్యక్రమాలకు సీఎంతోపాటు, ప్రతిపక్షనేతను ఆహ్వానిస్తుంటారు. ఈ కార్యక్రమానికి సైతం కేసీఆర్ హాజరుకాలేదు. ప్రతిపక్ష హోదాలో ఇంతవరకు గవర్నర్‌ను కలిసిన దాఖలాలు కూడా లేవు.

ప్రొటోకాల్‌పై రాద్దాంతం

ఎల్ఓపీ లీడర్‌గా ఎనిమిది నెలలుగా కేసీఆర్ ఎక్కడా కనిపించకుండా.. కేవలం ప్రొటోకాల్ విషయంలో మాత్రం ఆ పార్టీ రాద్దాంతం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికే పరిమితమయ్యే లీడర్‌కు ప్రతిపక్ష నేత ప్రొటోకాల్ ఎందుకు? అని కాంగ్రెస్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే వేడుకలకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆహ్వాన పత్రిక ముంద్రించారు. అందులో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అతిథులుగా ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే.. ఎల్ఓపీగా ఉన్న కేసీఆర్‌కు ప్రయారిటీ ఇవ్వలేదని ఆ పార్టీ లీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే.. కేసీఆర్‌కు అసెంబ్లీలో ఇరుకైన గది ఇచ్చారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభాపతి వద్ద ఆవేధన వ్యక్తం చేశారు. తమ నేతకు పెద్ద చాంబర్ కావాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News