మంత్రులు, ఎమ్మెల్యేల ‘హాస్టల్ బాట’! త్వరలో గురుకులాల విజిట్, రెగ్యులర్‌గా తనిఖీలు
త్వరలోనే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు గురుకులాల బాట పట్టనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు గురుకులాల బాట పట్టనున్నారు. అందుకోసం ‘హాస్టల్ బాట’ పేరిట కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. ఇందులో భాగంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని గురుకులాల్లోకి వెళ్లడంతో పాటు అక్కడే పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అదేవిధంగా హాస్టల్లో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేయనున్నారు. ఇటీవలి కాలంలో గురుకులాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. పిల్లలకు సరైన భోజనం పెట్టడం లేదని, కలుషిత భోజనంతో పాటు వారితోనే వార్డెన్లు అన్ని పనులు చేయించుకుంటున్నారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్పత్రుపాలైన ఘటనలు వెలుగుచూశాయి. ప్రతిపక్షాలు సైతం ఈ ఘటనలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేశాయి. దీంతో నెలలో ఒకసారి తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలు తమ పరిధిలోని గురుకులాలకు వెళ్లేలా ప్రభుత్వం కొత్త కార్యక్రమం చేపట్టనుంది.
ఈ వారం గురుకులానికి రేవంత్?
సీఎం రేవంత్ రెడ్డి ఈ వారంలోనే స్వయంగా గురుకులాలకు వెళ్లి అక్కడ చదువుతోన్న పిల్లలతో కొంత సేపు గడపడం, ప్రభుత్వం అందిస్తోన్న సౌకర్యాలపై ఆరా తీయడం, వారితో కలిసి లంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈనెల 14 లేదా 15 తేదీల్లో ఈ కార్యక్రమం ఉండొచ్చని అంచనా.అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం గురుకులాలకు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ప్రస్తుతం గురుకులాల్లో అమలవుతోన్న మెనును పూర్తిగా చేంజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మధ్యే మెస్‌చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఆ ధరలకు అనుగుణంగా కొత్త మెనూను రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని గురుకులాలకు రెగ్యూలర్‌గా వెళ్లడంతో పాటు ఒక పీరియడ్ బోధన చేయాలని ప్రభుత్వం కండీషన్ పెట్టనున్నట్టు తెలుస్తున్నది. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు రెగ్యూలర్‌గా గురుకులాలకు వెళ్లడం వల్ల అక్కడ జరిగే తప్పిదాలకు చెక్ పెట్టొచ్చనే అభిప్రాయంతో సీఎం రేవంత్ ఉన్నారని తెలుస్తోంది.