CS Somesh Kumar కు బిగ్ షాక్.. ఏపీకి వెళ్లాలని హైకోర్టు ఆదేశం
సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువడించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సోమేష్ కుమార్ ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ క్యాడర్‌లో కొనసాగడానికి వీలు లేదని, ఆయన తిరిగి ఏపీ కేడర్‌కు వెళ్లాలని మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం సోమేష్ కుమార్‌ను ఏపీ క్యాడర్‌కు కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం క్యాట్ ఉత్తర్వులు కొట్టివేసింది. సోమేష్ కుమార్ సేవలు అవసరం అని తెలంగాణ భావిస్తే ఏపీ అనుమతి తీసుకుని డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవాలని సూచించింది. అయితే తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని సోమేష్ కుమార్ తరపు న్యాయవాది కోర్టును విజ్ఞప్తి చేయగా ఇందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో సోమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఆయన ఏపీ కేడర్‌కు వెళ్తారా లేక తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.
Also Read...