Zaheerabad: జహీరాబాద్ లో కుండపోతగా వర్షం

జహీరాబాద్ లో కుండపోతగా వర్షం

Update: 2024-09-01 07:49 GMT

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలో వాయుగుండం ప్రభావంతో కుండపోతగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు, చెక్ డ్యాములు, చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా వేలాదెకరాల్లో సాగుతున్న కంది, సోయా, చెరుకు తదితర పంటలు నీట మునిగిపోయాయి. సంబంధిత శాఖల అధికారులు జల వనరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ వర్షపు నీటి ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. వర్షపునీరు, మురుగునీటితో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన మురుగు నీటి కాలువల్లో వర్షం నీరు స్తంభించకుండా చర్యలు చేపట్టారు. జహీరాబాద్ పట్టణంలో ప్రధాన రహదారులు, ఇతర రహదారుల్లో నీరు నిలవకుండా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నారు.

ఇంద్ర ప్రస్థాన్ , మాణిక్ ప్రభు మొహెల్లా , గడి హరిజనవాడ, జాతీయ రహదారిపై ఆర్ అండ్ బి బ్రిడ్జి, డ్రీమ్ ఇండియా కాలనీలో వర్షపు నీరు స్తంభించకుండా చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో నీటిని తొలగించి ప్రయాణికుల రాకపోకలకు అణువైన వాతావరణం కల్పిస్తున్నారు. పొంగి పొర్లి ప్రవహిస్తున్న నారింజ పరివాహక ప్రాంతంలో రంజోల్ తదితర గ్రామాలలో సోయాబీన్ , మినుము, పత్తి , కంది, బెండకాయ, వంకాయ తదితర పంటలు నీట మునిగాయి. ఏఈఓ ప్రదీప్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. వాయుగుండం ప్రభావంతో వర్షాలు విరివిగా కురవడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జహీరాబాద్ ఆర్డిఓ రాజు సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదించి పరిస్థితిలను సమీక్షిస్తున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు ఏఈ.జానకిరామ్, వై.రగులు ఈ ప్రాంతంలోని చెరువులను సందర్శించారు.

Tags:    

Similar News