మూసీ ప్రక్షాళన పై సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్

మూసీ సుందరీకరణ పై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలతో అబద్దమే అశ్చర్య పోయిందని మాజీ మంత్రి, బీఆరెఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు కౌంటర్ వేశారు.

Update: 2024-10-18 07:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : మూసీ సుందరీకరణ పై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలతో అబద్దమే అశ్చర్య పోయిందని మాజీ మంత్రి, బీఆరెఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్ రావు కౌంటర్ వేశారు. మూసీ సుందరీకరణపై బహిరంగ చర్చకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కు మేం సిద్దమని, చర్చకు రేపు ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉన్నానని, చర్చకు రేపు రమ్మంటారా ఎల్లుండి రమ్మంటారా? ఎక్కడికైనా వస్తా ఎలాంటి చర్చకైనా సిద్ధమని, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తానని డేట్ టైమ్ రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు. మూసీ బాధితుల వద్దకు వచ్చేందుకు మేం సిద్దమన్నారు. మేం మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, అసలు మూసీ సుందరీకరణను2800కోట్లతో 36శుద్దీ కేంద్రాలను ప్రారంభించిందే తమ కేసీఆర్ ప్రభుత్వమన్న సంగతి గుర్తించాలన్నారు. కేసీఆర్ హయాంలోనే మూసీలోకి 1100కోట్లతో గోదావరి జలాలను తరలించేందుకు డీపీఆర్ సిద్దమైందని హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ మూసీ పునరుజ్జీవంను వ్యతిరేకించడం లేదని, పేదల ఇళ్ళను కూల్చడాన్నే మేం వ్యతిరేకిస్తున్నామన్నారు.

మూసీ నది శుద్ధి చేయాలంటే వ్యర్ధాలు వచ్చి చేరకుండా అడ్డుకోవాలని, నీటిని శుద్ధి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితులను పట్టించుకోలేదని అబద్దాలు చెప్పాడటం సిగ్గుచేటని, 2013చట్టం మేరకు అంతకుమించి మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్ని సహాయ, పునరావాస చర్యలు తీసుకున్నామన్నారు. రెండురెట్ల పరిహారంతో పాటు 250గజాల ఇండ్లు మున్సిపాల్టీలో కట్టించామని, 18ఏండ్లు నిండిన వారందరికి ఆర్ఆండ్ఆర్ ప్యాకేజీ అందించామని తెలిపారు. రేవంత్ రెడ్డికి మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల అంత ప్రేమ ఉంటే మిగిలిపోయిన వారికి ఆర్అండ్ఆర్ కోసం 200కోట్లు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మూసీ పునరుజ్జీవమంటూ, ఫ్యూచర్ సిటీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. మూసీ పరివాహకంలో మల్లన్న ఇంటిని కూల్చి మాల్ కడుతామని చెప్పడం వ్యాపారం కాదా అని ప్రశ్నించారు.

మూసీ నిర్వాసితులకు మేం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి, 25వేలు మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడని, నిర్వాసితుల పట్ల శ్రద్ద ఉంటే వారికి 2013చట్టం మేరకు సహాయ, పునరావాసం కల్పించాలన్నారు. గచ్చిబౌలీలో ఇటీవల కేసు గెలిచిన 480ఎకరాల భూమిలో మూసీ నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తే మేం కూడా స్వాగతిస్తామన్నారు. బఫర్ జోన్ లో నేను మూడు నెలలు ఉంటే నిర్వాసితులకు మేలు జరుగుతుందంటే నేను నాలుగు నెలలైనా ఉంటానన్నారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయిని దిగజార్చారని, సీఎం కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజల దృష్టిని మళ్ళీంచేందుకు మూసీ సమస్యను తెరపైకి తెచ్చాడని, మోసపూరిత కాంగ్రెస్ పార్టీ ఇటీవల హర్యానా ఎన్నికల్లో చతికిల పడిందని ఎద్దేవా చేశారు.


Similar News