'రుణమాఫీ చేయమంటే ఒట్ల పేరుతో రేవంత్ రెడ్డి కొత్త డ్రామా'
హామీలు అమలు చేయమని సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి తోకముడిచి పారిపోయారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: హామీలు అమలు చేయమని సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి తోకముడిచి పారిపోయారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి 150 రోజులైనా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. మాయమాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని డిసెంబర్ 9న రైతురుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఆ హామీని అమలు పరచకుండా ఇప్పుడు దేవుళ్లమీద ఓట్లు కోరుతూ కొత్త డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు. రూ. 4 వేల పెన్షన్ తీసుకున్నవాళ్లు, వడ్లకు బోనస్ తీసుకున్న వాళ్లు, కాంగ్రెస్ కు ఓటు వేయాలని లేకుంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. మహాలక్ష్మి కింద నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేశారని నాలుగు నెలలుగా ఈ హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రంలోని మహిళలకు రూ.10 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. జిల్లాలను తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. బీజేపీని నమ్మడం అంటే నీళ్లు లేని బావిలో దూకడమే అని దుబ్బాకలో చెల్లని రఘునందన్ రావు మెదక్ లో చెల్లుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని కాంగ్రెస్ మెడలు వంచాలంటే అది గులాబీ జెండతోనే సాధ్యం అవుతుందన్నారు.
Read More...