Harish Rao: పెండింగ్ బిల్లులు వసూలు చేయడం దుర్మార్గం: మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ట్వీట్

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ‘గృహజ్యోతి’ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతోంది.

Update: 2024-08-31 04:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ‘గృహజ్యోతి’ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతోంది.ఇందులో భాగంగా 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటును వాడే వారు ఈ పథాకానికి అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మంది గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కానీ, పథకం కోసం దరఖాస్తు చేసుకున్న చాలామంది అర్హులకు నేటికీ జీరో బిల్ రాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత వారందరికీ జీరో బిల్స్ వచ్చాయి.

అయితే గత ఆరు నెలలుగా జీరో బిల్లు జనరేట్‌ కాని వారికి సంబంధించి బకాయిలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని సర్కార్ నుంచి విద్యుత్ శాఖకు ఆదేశాలు అందాయి. జీరో బిల్లు ఎప్పటి నుంచి జనరేట్‌ అవుతోందో అప్పటి నుంచే గృహజ్యోతి పథకం వర్తిస్తుందని, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి జీరో బిల్లు రాని వారి నుంచి బిల్లులు వసూలు చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన విద్యుత్తు అధికార యంత్రాంగం బకాయిల వసూలుకు కదిలారు.

ఈ క్రమంలోనే హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణ చేశారు. ‘తూతూమంత్రంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకాన్ని పూర్తిగా అటకెక్కిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు డబ్బా కొట్టుకుంటూ.. వాస్తవానికి మాత్రం పేదల నుంచి మళ్లీ బిల్లులు వసూలు చేస్తున్నారు. జీరో బిల్లులు జనరేట్ కాలేదనే నెపంతో పేదల నుంచి పెండింగ్ బిల్లులు వసూలు చేయడం దుర్మార్గం. ఎన్నికల ముందు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట. మేనిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీలు 13 హామీల్లో ఒక్క పథకాన్ని అయినా సంపూర్ణంగా అమలు చేస్తున్నారా? అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.


Similar News