KTR: నాచారంలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను పరిశీలించిన కేటీఆర్

నాచారంలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను కేటీఆర్ ఈ రోజు (ఆదివారం) ఉదయం పరిశీలించారు.

Update: 2024-10-27 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: నాచారంలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ (Nacharam sewarege treatment plant)ను కేటీఆర్ ఈ రోజు (ఆదివారం) ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరు ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విచ్చలవిడిగా వెలువడుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుంచి వస్తున్న మురుగునీటి శుద్ధిలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఎంతో ప్రాముఖ్యమైనవని అన్నారు. కేసీఆర్ (KCR) నాయకత్వంలో సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, హైదరాబాద్ బాగుండాలనే ఉద్దేశంతో పని చేశామని కేటీఆర్ (KTR)) చెప్పుకొచ్చారు. దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్లాంట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుందని అన్నారు.

అనంతరం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. ఇల్లు తాము కడితే CM రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సున్నాలు వేస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. రుణమాఫీకి, రైతుబంధుకు ప్రభుత్వం వద్ద పైసలు లేవని, ఏ పథకం అమలు చేయాలన్నా పైసలు లేవని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారని, మరి మూసీ పునరుజ్జీవనానికి మాత్రం ప్రభుత్వం వద్ద పైసలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. రియల్ఎస్టేట్ కోసమే మూసీ పునరుజ్జీవం చేస్తున్నారని, మూసీ పేరుతో కాంగ్రెస్ (Congress) దోపిడీలకు దిగుతోందని, మూసీ మాటున ఢిల్లీకి మూటలు పంపేందుకు వెనకేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలకు బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు తమ పార్టీ పోరాడుతుందుని, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ ఎమ్మెల్యేలు ముందుంటారని కేటీఆర్‌ తెలిపారు. ఇక ఈ విజిట్‌లో కేటీఆర్‌తో పాటు మాజీ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మరికొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.


Similar News