పార్టీ మార్పు ప్రచారంపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో హరీశ్ రావు స్పష్టత ఇచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంపై సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు స్పందించారు. వ్యూవ్స్, బ్రేకింగ్స్ కోసం కొన్ని మీడియా హౌస్ లు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానని కొందరు, కాంగ్రెస్ లోకి వెళ్తున్నానని మరి కొందరు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రాబోతున్నదని మరి కొందరు తమకు తోచినట్లుగా రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటి వల్ల లీడర్ క్రెడిబిలిటీ దెబ్బతింటుందన్నారు. తన విషయంలో ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని, నా క్రెడిబిలిటిని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజాలు రాయాలన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు డిమాండ్లు చేశారు.
అధికారంలోకి వచ్చాక వదిలేస్తారా?:
గ్రూప్-1 గ్రూప్-2 అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వదిలేశారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు ఉంచారు. గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 తీసుకోవాలని, గ్రూప్-2 అదనంగా 2 వేల పోస్టులు పెంచాలని. పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని, 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని, హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. లేని పక్షంలోని నిరుద్యోగుల పక్షాన, గ్రూప్స్ అభ్యర్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతున్నా నాలుగు వేల పెంచన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిపోగానే ఆసరా పించన్లన ఆగిపోయాయయని ఏప్రిల్, మే నెలల ఆసరా పించన్లు వేయలేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో పెంచన్లు పెంచుతామని చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు అధికారంలోకి రాగానే పెంచన్లను పెంచుతూ సంతకం పెట్టారని మరి మీ సంతకం ఎప్పుడు పెడతారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. చంద్రబాబును చూసి రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలన్నారు. కొత్త పించన్లతో పాటు పాత బకాయిలు కలిపి పించన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతినెల మొదటి తేదీనే జీతాలు ఇస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే తమకు మొదటి తేదీనే జీతాలు ఇవ్వాలని ఆశావర్కర్లు, అంగన్ వాడీ టీచర్లు రోడెక్కుతున్నారని విమర్శించారు. రెండు నెలలుగా అంగన్ వాడీలకు జీతాలు ఇవ్వకుండా వారి ఉసురు పోసుకుంటోందని విమర్శించారు.
బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించరా?:
బీజేపీ హయాంలో సంపద అంతా కొందరి చేతుల్లోకి పోయిందని అలాగే విద్య కూడా కొందరి చేతుల్లోకి పోతోదంని విమర్శించారు. బీజేపీ పాలనలో మెడికల్ విద్య అంగట్లో సరుకుగా మారిందన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ లోపం, ప్రభుత్వ వైఫల్యం వల్ల, 24 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని వారి భవిష్యత్ పై నీలిమేఘాలు కమ్మకున్నాయన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కనీసం స్పందించడం లేదన్నారు. దురదృష్టవశాత్తు టీఎస్ పీఎస్సీపేపర్ లీకేజీ అయితే రాద్ధాంతం చేసిన బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇవాళ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నీట్ లో తెలుగు విద్యార్థులు ఉన్నారని ఈ సమస్యపై మీ స్పందన ఏంటని ప్రశ్నించారు. మన్ కీ బాత్ చెప్పే ప్రధాని మోడీ ఈ అంశంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. నీట్ లో ఓకే సెంటర్ లో పరీక్ష రాసిన ఆరుగురికి 720 మార్కులు వచ్చాయంటే పేపర్ లీక్ అయిందనే వాదన బలపడుతోందన్నారు. నీట్ లో గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదని అలాంటప్పుడు 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఎలా కలిపారన్నారు. గ్రేస్ మార్కులు కలిపిన ఆ విద్యార్థుల లిస్ట్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. నీట్ ఫలితాలను పది రోజుల ముందుకు జరిపి సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు ఫలితాల రోజే విడుదల చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. పేపర్ లీకే కాకపోతే అయా రాష్ట్రాల్లో అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు.