Gutta Sukhender Reddy: ప్రతిపక్ష నాయకుల భాష సరిగ్గా లేదు: మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ టూర్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన కామెంట్స్‌పై తాజాగా, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) తీవ్ర స్థాయిలో స్పందించారు.

Update: 2024-10-09 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ టూర్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన కామెంట్స్‌పై తాజాగా, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ మధ్య కాలంలో సీఎం, మంత్రులపై ప్రతిపక్ష నాయకులు వాడే భాష సరిగ్గా లేదని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి వెళితే తప్పేముందని ప్రశ్నించారు. ప్రజల మేలు కొరకే ఆయన హస్తినకు వెళ్లారని.. సీఎం పర్యటనపై మాట్లాడే అర్హత ఎవరికీ లేదని హితవు పలికారు. మూసీ ప్రక్షాళన విషయంలో సర్కార్ ముమ్మాటికీ మంచి నిర్ణయమే తీసుకుందని కొనియాడారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి డీపీఆర్ రూపొందించకుండానే రేవంత్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాలు, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

కాగా, సీఎం రేవంత్‌ ఢిల్లీ టూర్‌పై రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇటీవలే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు సంబంధించి లెక్కలు చెప్పేందుకే రేవంత్ ఢిల్లీకి నిత్యం వెళ్తున్నారని కామెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే 23 సార్లు హస్తినకు వెళ్లిన సీఎం రాష్ట్ర ప్రజల కోసం సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ఫ్లైట్‌ కిరాయిలతో సమానంగా.. ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పది నెలల్లోనే ఇలా సీఎం ఢిల్లీకి వెళితే.. రాబోయే కాలంలో 125 సార్లు వెళ్తారేమోనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Similar News