చేరికలకు AICC నుంచి గ్రీన్ సిగ్నల్.. జాయినింగ్స్ స్పీడప్!

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు మరింత ముమ్మరం కానున్నాయి.

Update: 2024-06-27 02:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు మరింత ముమ్మరం కానున్నాయి. ఇందుకు ఏఐసీసీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చేరికలు తప్పవని అభిప్రాయానికి వచ్చిన అధిష్టానం.. గులాబీ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పీసీసీకి సూచించినట్టు సమాచారం. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు తోడుగా కొందరు సీనియర్లు సైతం రేవంత్ తీరును తప్పుపడుతూ, అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నామనే విషయంపై అధిష్టానానికి వివరించడంతో.. అందుకు ఏఐసీసీ పెద్దలు సానకూలంగా స్పందించినట్టు సమాచారం.

బీజేపీని కట్టడి చేసేందుకే..

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సంప్రదింపులు సైతం జరిపింది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి, ఎమ్మెల్యేలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశంపైనా ఆయన పార్టీ అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మనం చేర్చుకోకపోతే, బీజేపీలోకి వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే, రాష్ట్రంలో బీజేపీ మరింత బలంగా మారే అవకాశాన్ని మనమే ఇచ్చినట్టు అవుతుంది.’ అని హైకమాండ్‌కు రేవంత్ వివరణ ఇచ్చినట్టు టాక్. రేవంత్ అభిప్రాయంతో ఏకీభవించిన అధిష్టానం.. చేరికలను కంటిన్యూ చేయాలని సూచించినట్టు టాక్.

అసంతృప్తులు, అలకల విషయంలో జాగ్రత్త..

బీఆర్ఎస్‌కు చెందిన నేతలు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో హస్తం పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తికి గురవుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధిష్టానం సూచించినట్టు తెలిసింది. వలసల వల్ల పార్టీలో అసంతృప్తులు, అలకలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముందుగా లోకల్ లీడర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. విపక్ష ఎమ్మెల్యేల చేరికలతో పార్టీ లీడర్ల ప్రయారిటీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని ఆదేశించినట్టు టాక్. ఇప్పటివరకు పార్టీలో చేరిన గులాబీ ఎమ్మెల్యేలతో ఏఏ నియోజకవర్గాల్లో నిరసనలు జరిగాయి? అనే కోణంలో అధిష్టానం ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతున్నది. జగిత్యాల మినహా మరెక్కడా పెద్దగా అసంతృప్తులు లేవని రాష్ట్ర నాయకత్వం రిపోర్టు ఇచ్చినట్టు టాక్.

అసెంబ్లీ సెషన్ లోపే మరో 11 మంది?

బీఆర్ఎస్ నుంచి త్వరలో కాంగ్రెస్‌లో చేరబోయే ఎమ్మెల్యేల జాబితాను సీఎం రేవంత్.. అధిష్టానానికి అందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సెషన్ లోపు మరో 11 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని చెప్పినట్టు సమాచారం. బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు కావాల్సిన సభ్యుల కోసం పీసీసీ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 5 మంది ఎమ్మెల్యేలు (దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్) గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. త్వరలో 11 మంది చేరబోతుండటంతో ఆ సంఖ్య 16కు చేరునుంది. కానీ, ఎల్పీ విలీనం కోసం మరో 9 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండటంతో ఆ విషయంపై సీరియస్‌గా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది.


Similar News