TG: ముగిసిన గ్రాడ్యుయేట్ MLC పోలింగ్
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సాయంత్రం 4 గంటల తర్వాత క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉండనుంది. మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహించారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్ పేపర్ వినియోగించారు. వీటికోసం జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగించారు. మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు. వచ్చే నెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు.