సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం.. మొత్తం 11 లోపాలు గుర్తించిన పోలీసులు

ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Update: 2024-12-18 02:54 GMT

దిశ, సిటీక్రైం/రాంనగర్: ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు చిక్కడపల్లి పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పుష్ప2 ప్రీమియర్ షో తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఒకరి మృతికి కారణమైన థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని పేర్కొన్నారు.

1. సంధ్య ధియేటర్‌లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి, ఇందులో రెండు థియేటర్‌లు కలిపి ఒక షోకు 2 వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉంది.

2. థియేటర్‌లో సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులకు లోపలికి వెళ్లేందుకు, బయటికి వచ్చేందుకు సరైన సూచిక బోర్డులు లేవు.

3. సరైన అనుమతులు లేకుండా ధియేటర్ బయట భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో అభిమానులు భారీగా గుమ్మిగూడారు.

4. థియేటర్‌లో సరైన సౌకర్యాలు లేవు. లోయర్ బాల్కని ప్రవేశ ద్వారం వద్ద సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో ప్రేక్షకుల తాకిడి పెరిగి ధ్వంసమైంది.

5. థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్, ఇంకా చిత్ర బృందం రాకకు సంబంధించి సరైన పద్ధతిలో పోలీసులకు సమాచారం అందించలేదు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, సినీ నటులకు సరైన సిటీంగ్‌ను ఏర్పాటు చేయలేదు.

6. సినీ అభిమానులు థియేటర్ వద్దకు వచ్చే విధంగా భారీ లైటింగ్‌తో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాట్లు చేశారు.

7. అల్లు అర్జున్ థియేటర్‌లోకి వచ్చే సందర్భంలో ఆయన ప్రైవేట్ సెక్యురిటీకి కూడా ప్రవేశాన్ని ఇవ్వడంతో లోపల సినీ ప్రేక్షకులకు ఇబ్బందులు తలెత్తాయి.

8. థియేటర్‌లో ఒకే ఒక డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ మాత్రమే ఉంది. మహిళ ప్రేక్షకుల కోసం సరైన చెకింగ్ ఏర్పాట్లు లేవు. అందరూ డిఎఫ్ఎమ్డి నుంచి వెళ్లేలా చర్యలు తీసుకోలేదు.

9. టికెట్‌ల తనిఖీకి సంబంధించి సరైన ప్రక్రీయ లేకపోవడంతో టికెట్‌లు లేని వారు కూడా భారీగా థియేటర్‌లోకి చొచ్చుకువచ్చారు. దీంతో ఉక్కిబిక్కిరి వాతావరణం నెలకొంది.

10. థియేటర్ సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులకు పరైన పార్కింగ్ వ్యవస్థ లేదు.

11. థియేటర్ యాజమాన్యం లోపల, ప్రధాన గేటు వద్ద పూర్తి భద్రత చర్యలను తీసుకోలేదు. ఈ నేపధ్యంలోనే సంఘటన చోటు చేసుకుంది.

ఈ 11 లోపాలు పోలీసుల పరిశీలనలో బయటపడ్డాయి. ఈ లోపాలు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది. ఈ నేపధ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు సంధ్య ధియేటర్ యాజమాన్యానికి ఈ నెల 12న షోకాజ్ నోటీసు ఇచ్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన సినిమాటోగ్రాఫి లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయొద్దనే అంశంపై సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. 10 రోజులలో సమాధానం రాకపోతే లైసెన్స్ రద్దుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసేందుకు అవకాశం ఉంది.

Tags:    

Similar News