Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక పిలుపు

ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం(Modi Govt) కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.

Update: 2024-12-18 05:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం(Modi Govt) కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదని అన్నారు. మన దేశంలో 121 భాషలు ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవి.. ఇవాళ ఆ సంఖ్యను మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 భాషలకు పెంచారని గుర్తుచేశారు. ఈ భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్లో(Jammu and Kashmir) అధికార భాషల బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాం. దీని ప్రకారం.. జమ్మూకశ్మీర్లో అధికారిక అవసరాల కోసం.. కశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీని వినియోగించేలా చట్టం తీసుకొచ్చామని అన్నారు.

మోడీ ప్రభుత్వంలో జరిగిన NEP-2020 ద్వారా స్థానీయ భాషలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. మొదట్లో దీన్ని విమర్శించిన వారు కూడా ఇప్పుడు సమర్థిస్తున్నారని అన్నారు. విద్యావిధానం సులభతరం అవుతుందని, మాతృభాషలో విద్య ద్వారా వికాసం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. భారతీయ భాషల పట్ల మనమంతా గర్వించాలి. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. దీంతోపాటుగా మన మాతృభాషలకు కూడా సరిగ్గా గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ పేరుతో.. ప్రాంతీయ భాషలు, ప్రాంతీయ సంస్కతి, ప్రాంతీయ కళాకారులను కేంద్రం ప్రోత్సహిస్తోందని అన్నారు. ప్రతి భారతీయుడు తన మాతృభాషలో చదువుకోవాలి, మాతృభాషలో మాట్లాడాలి, మాతృభాషను ప్రోత్సహించాలని సూచించారు.

Tags:    

Similar News