సర్కార్ మరో కీలక నిర్ణయం.. నెలాఖరు వరకు డెడ్‌లైన్

కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

Update: 2024-12-18 02:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే.. డెసిషన్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా ఎజెండాలో ఉన్న కొత్తగా 69 గ్రామపంచాయతీలు ఏర్పాటు ప్రతిపాదన కేబినెట్ ముందుకు వచ్చింది. దీంతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ముందస్తు ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన పంచాయతీలను ఏర్పాటు చేశారని, దీంతో ఆ జీపీలు కనీస నిర్వహణ కోసం నిధులు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసినట్లు తెలిసింది. గత పదేళ్లలో వంద, రెండు వందల జనాభా ఉన్న గ్రామాలను సైతం జీపీలుగా చేశారని, దీంతో ఆ పంచాయతీలు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని అభిప్రాయపడినట్లు సమాచారం. కనీసస్థాయిలో కూడా ఆదాయం లేకపోవడంతో ప్రతి చిన్నదానికి ప్రభుత్వంపై ఆధారపడడం, సరైన వసతులు ఏర్పాటు చేయడానికి అవకాశాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పినట్లు తెలిసింది.

దీంతో అక్కడి ప్రజాప్రతినిధులపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని పేర్కొన్నట్లు సమాచారం. ఇకపై కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, ప్రతిపాదనలను జిల్లా ఇన్ చార్జి మంత్రి ద్వారా మాత్రమే ప్రభుత్వానికి పంపించాలని సూచించినట్లు తెలిసింది. శాసనసభ్యులు ప్రతిపాదనలు పంపించగానే వాటిని ఆమోదించడం సరికాదని, రాజకీయ అవసరాలు, ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవడం కాకుండా గ్రామ పంచాయతీ ఏర్పాటు తరువాత ఉండే పరిస్థితుల గురించి కూడా ఆలోచించాలని చెప్పినట్లు సమాచారం. కొత్త జీపీల ఏర్పాటు అవసరమున్న వాటిని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈనెల 30వ తేదీలోగా ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించినట్లు తెలిసింది. అయితే నెలాఖరులోగా పంపిస్తే కొత్త జీపీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుందని, ఓటరు జాబితా, వార్డుల విభజన తదితర ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందనే అంచనాతో ఈనెలాఖరు వరకు గడువు విధించినట్లుగా సమాచారం. ఈనెలాఖరులోగా ప్రతిపాదనలు వచ్చి.. ఆ తదుపరి కేబినెట్ ఆమోదిస్తే కొత్త జీపీల ఏర్పాటు గురించి ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News