రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఆ రంగంపై సర్కారు ఫోకస్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడి!
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టూరిజం విజన్‌పై సర్కారు దృష్టి సారించింది. 2025-30 పేరుతో టూరిజం పాలసీని రూపొందించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టూరిజం విజన్‌పై సర్కారు దృష్టి సారించింది. 2025-30 పేరుతో టూరిజం పాలసీని రూపొందించింది. తెలంగాణలో పర్యాటకాన్ని మరింత పెంచి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పర్యాటకులు, పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి సర్వీసులను కల్పించాలని చూస్తోంది. ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, అడ్వెంచర్, పర్యావరణ టూరిజాన్ని మరింత ప్రోత్సహించడం ద్వారా దేశంలోనే అత్యంత ప్రాధాన్యత గల రాష్ట్రంగా తెలంగాణను నిలపడమే 2025-30 టూరిజం పాలసీ విజన్‌గా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది.
పాలసీ ప్రధాన లక్ష్యాలివే..
టూరిజం విజన్‌లో భాగంగా సర్కారు ఐదు ప్రధాన లక్ష్యాలను పెట్టుకుంది. రాబోయే ఐదేండ్లలో టూరిజం రంగానికి రూ.15 వేల కోట్ల నూతన పెట్టుబడులను ఆకర్షించాలని టార్గెట్ పెట్టుకుంది. తద్వారా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలని భావిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల తాకిడిలో దేశంలోనే మొదటి 5 రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణను నిలపాలని ప్లాన్ చేస్తోంది. అందుకు డిజిటల్ మార్కెటింగ్, లిటరరీ డాక్యుమెంటేషన్, సోషల్ మీడియా వేదికగా ముందుకెళ్లాలని చూస్తోంది. తద్వారా ప్రపంచస్థాయిలో రాష్ట్ర విభిన్న ఆకర్షణలను ప్రతిబింబించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. అనుకున్న లక్ష్యాలను చేరుకుని టూరిజం ద్వారా రాష్ట్ర జీడీపీని 10 % లేదా అంతకంటే ఎక్కువగా పెంపొందించడంపై ఫోకస్ పెడుతోంది. ఈ శాసనసభ సమావేశాల్లో టూరిజం పాలసీకి సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేబినెట్ ఆమోదం తెలిపాక జనవరి నుంచి ఈ పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.సురక్షిత టూరిజం, మౌలిక సదుపాయాల కల్పన, ప్రత్యేక టూరిజం ప్రాంతాల అభివృద్ధి ఆధారంగా దీన్ని సుసాధ్యం చేసుకోవచ్చని అనుకుంటోంది.
టూరిస్టుల సేఫ్టీకి ప్రత్యేక పోలీసు యూనిట్లు
టూరిస్టులకు భద్రత కల్పించేలా ప్రత్యేక టూరిస్ట్ పోలీసు యూనిట్లు, టూరిస్టు పెట్రోలింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రధానంగా మహిళా పర్యాటకులకు భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా టూరిజం ఫ్రెండ్లీ ఇండెక్స్(టీఎఫ్ఐ) ద్వారా భద్రతా ప్రమాణాలను పెంపొందించాలని భావిస్తోంది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్‌ను కీలకమైన ప్రాంతంగా పరిగణించి, దీని పరిసరాల్లో అంటే 1-2 గంటల ప్రయాణ దూరంలో ఐకానిక్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. రీజినల్ రింగు రోడ్డు గుండా డ్రై పోర్టుల అభివృద్ధితో పాటు గ్రీన్ ఫీల్డ్ హైవే నుంచి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తే.. వెడ్డింగ్ షాపింగ్, గోల్డ్ సౌక్స్, ఔట్‌లెట్ మాల్స్, ఫర్నీచర్ మాల్స్ ఏర్పాటుతో వ్యాపార పర్యాటక అభివృద్ధికి మరింత అనుకూలమవుతుందనే వ్యూహంతో ప్రభుత్వం ఉంది. దీన్ని పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఆధారంగా ఔటర్ రింగ్ ఎగ్జిట్ పాయింట్స్ గుండా లగ్జరీ బ్రాండెడ్ మాల్స్, ఫ్యాక్టరీ ఔట్‌లెట్స్‌ను డెవలప్ చేయాలని చూస్తోంది. గోదావరి, కృష్టానది పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు హౌజ్ బోట్స్, వాటర్ స్పోర్ట్స్, వాటర్ కార్నివల్స్ ఉండేలా ‘రివర్ ఫెస్టివల్స్’ను ప్రారంభించాలని అనుకుంటోంది.
27 స్పెషల్ టూరిజం స్పాట్స్ గుర్తింపు
స్పెషల్ టూరిజం ఏరియాల్లో మిషన్ మోడ్‌పై రాష్ట్రమంతటా ప్రత్యేక టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోంది. ప్రత్యేక టూరిజం కోసం హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేయాలనే ప్లాన్‌లో సర్కారు ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 స్పెషల్ టూరిజం ఏరియాలను ప్రభుత్వం గుర్తించింది. అందులో ప్రధానంగా వికారాబాద్, సోమశిల, రామప్ప, కాళేశ్వరం, నాగార్జునసాగర్, భద్రాచలం, వరంగల్, ట్రైబల్ సర్క్యూట్, చార్మినార్‌ను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మరిన్ని సర్క్యూట్లు సైతం ఉన్నాయి.
పెట్టుబడిదారులకు 50 % జీఎస్టీ మినహాయింపు!
పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి పెట్టుబడిదారులకు నికర రాష్ట్ర జీఎస్టీని మినహాయింపు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఐదేండ్ల కాలపరిమితికి పెట్టుబడిదారులకు 50 % నికర జీఎస్టీని మినహాయించాలని భావిస్తోంది. ఐకానిక్ ప్రాజెక్టులకు సైతం నికర రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు ఇవ్వనున్నారు. అయితే, కేటగిరీ-ఏలో ఉండే హోటళ్లు, రిసార్టులకు రాష్ట్ర జీఎస్టీ కల్పించే రీయింబర్స్‌మెంట్ వర్తించదు.