Telangana:రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా సన్న బియ్యం పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
దిశ,వెబ్‌డెస్క్: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా సన్న బియ్యం పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు(Ration Card) ఉన్న ప్రతీ ఒక్కరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar) వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ వానాకాలం 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని, రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం అని పేర్కొన్నారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నారు. ఈ సన్న బియ్యం జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారని ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ప్రకటించిన సంగతి తెలిసిందే.