ప్రాపర్టీ ట్యాక్స్‌ను ఆన్‌లైన్‌లో అమాంతం పెంచేసిన జీహెచ్ఎంసీ..?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఆన్‌లైన్‌లలో అమాంతం పెంచేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్‌ను జీహెచ్ఎంసీ అధికారులు ఆన్‌లైన్‌లలో అమాంతం పెంచేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాత సర్కారు అనుమతితో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత పన్నును పెంచాల్సి ఉండగా, అధికారులు ఆన్‌లైన్‌లో అమాంతం పెంచేసినట్లు పలువురు చెల్లింపుదారులు వాపోతున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి ఆర్థికంగా ఊరట కలిగించేందుకే అధికారులు పన్ను పెంచినట్లు ఆరోపణలున్నాయి. సిటిలో ప్రతి ఏటా కొత్తగా అందుబాటులోకి వచ్చే కొత్త భవనాలతో పాటు వ్యాపార సంస్థలకు కొత్తగా అసెస్‌మెంట్ చేసి పన్ను పరిధిలోకి తెస్తుంటారు.
కానీ గతంలోనే అసెస్‌మెంట్ చేసిన ఆస్తుల్లోని ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారికి అంతకు ముందున్న యజమాని చెల్లించే పన్నులో అదనంగా 50 శాతం వడ్డిస్తున్నట్లు పలువురు చెల్లింపుదారులు వాపోతున్నారు. తాము గతంలో పెంచిన ట్యాక్స్‌ను మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులు ఆన్‌లైన్‌లో పన్ను ఎలా పెరిగిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇష్టపడటం లేదు. గ్రేటర్ నగరంలో సుమారు 16.5 లక్షల మంది రెసిడెన్షియల్ ఆస్తి పన్ను చెల్లిస్తుండగా, మరో 2.5 లక్షల మంది కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్‌ను చెల్లిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా పన్నును పెంచటం పట్ల లీగల్‌గా ముందుకెళ్లాలని కొందరు బకాయిదార్లు భావిస్తున్నట్లు సమాచారం.
పెంపు ఇలా..
వర్తమాన సంసత్సరం రూ.2 వేల కోట్ల ఆస్తిపన్ను వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకోగా, పాత బకాయిలు, వాటి వడ్డీతో కలిపి మొత్తం సుమారు రూ.3 వేల కోట్ల వరకు వసూలు చేయాలని భావిస్తున్నారు. నగరంలో గతంలో రెసిడెన్షియల్ నిర్మాణాలకు ప్రతి చదరపు అడుగుకు 75 పైసలు వసూలు చేసేవారు, కానీ ప్రస్తుతం అది 1.50 పైసలకు పైగా పెరిగినట్లు చెల్లింపుదారులు వాపోతున్నారు. ఇక కమర్షియల్ ఆస్తి పన్ను లోని వివిధ కేటగిరీల వారీగా కూడా పన్ను పెంచినట్లు విమర్శలున్నాయి. ఏబీసీ కేటగిరిలో కూడా పెంచేశారు. ఏ కేటగిరి లో చదరపు అడుగుకు గతంలో రూ.4 ఉంటే ప్రస్తుతం రూ.6 వసూలు చేస్తున్నారని, బీ కేటగిరిలో రూ.3.50 ఉండగా ప్రస్తుతం రూ.4.50కు పెంచినట్లు పలువురు వ్యాపారస్తులు వాపోతున్నారు. సీ కేటగిరిలో రూ.3 గా ఉన్న పన్నును రూ.4కు పెంచినట్లు కూడా ఆరోపణలున్నాయి.
సెల్ఫ్ అసెస్‌మెంట్ విధానంలో ఇంటి విస్తీర్ణం ఎరియా ఎంటర్ చేస్తే చాలు అధిక పన్ను వచ్చేస్తుంది. ఇక ఒక బిల్డింగ్ పాత ఫ్లాట్ కొనుగోలు చేస్తే అప్పటి వరకు ఉన్న రేటు కాకుండా అధికంగా పన్ను వేస్తున్నారు బల్దియా అధికారులు. ఇటివలే సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో సుమారు 1150 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ఆ ఇంటిని విక్రయించిన యజమాని గతంలో ట్యాక్స్ రూ.3898 చెల్లిస్తుండగా, ఇప్పుడదీ రూ.4550 లకు పెరిగింది. అంటే రూ.652 రూపాయలు అధికంగా చెల్లించాల్సి వస్తుందని, ఇది ఒక రకంగా తమపై అదనపు ఆర్థిక భారమేనని చెల్లింపుదారులు వాపోతున్నారు.