ఇన్ఫర్మేషన్ కమిషన్‌ను వెంటనే నెలకొల్పాలి.. సీఎం రేవంత్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

ప్రతీ రాష్ట్రంలో సమాచార కమిషన్(Information Commission) నియామకం తప్పనిసరి అని, కానీ తెలంగాణలో మాత్రం దాదాపు ఎడాదిన్నర నుంచి ఖాళీగా ఉన్నదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(Forum for Good Governance) ఆరోపించింది.

Update: 2024-09-28 15:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీ రాష్ట్రంలో సమాచార కమిషన్(Information Commission) నియామకం తప్పనిసరి అని, కానీ తెలంగాణలో మాత్రం దాదాపు ఎడాదిన్నర నుంచి ఖాళీగా ఉన్నదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(Forum for Good Governance) ఆరోపించింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం ప్రధాన కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్ల నియామకం జరగాల్సి ఉన్నదని, కానీ గతేడాది ఫిబ్రవరిలో కమిషన్ గడువు తీరిపోయినా కొత్తదాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని గుర్తుచేసింది. ఇదే విషయమై హైకోర్టులో గతేడాది పిటిషన్ దాఖలు చేశామని, జూలైలోనే ప్రభుత్వానికి నియామకంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నది. కమిషన్‌ను నియమించడంపై కసరత్తు మొదలైందని, తొందర్లోనే ప్రధాన కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్లను కూడా నియమిస్తామని హైకోర్టుకు అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటివరకూ అది మాటలకే పరిమితమైందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)కి రాసిన లేఖలో ఫోరం ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ కమిషన్ లేని కారణంగా ప్రభుత్వ యంత్రాంగం అనేక దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వడంలేదని, అప్పీల్ చేసుకోడానికి కమిషన్ లేదన్నదే ఇందుకు కారణమని ఆ లేఖలో పద్మనాభరెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోతే కమిషన్‌ను ఆశ్రయించవచ్చన్న భరోసా దరఖాస్తుదారుల్లో లేకుండా పోయిందన్నారు. విశాలమైన విషయ పరిజ్ఞానంతో పాటు సమాచార హక్కు చట్టంపైన అవగాహన, శాస్త్ర సాంకేతిక రంగాలమీద కూడా పట్టు ఉండాలని గుర్తుచేశారు. సోషల్ సర్వీస్, మేనేజ్‌మెంట్, జర్నలిజం, మీడియా, కార్యనిర్వహణ వ్యవస్థ, పరిపాలన తదితర రంగాల్లో అనుభవం ఉన్నవారిని ప్రధాన కమిషనర్, కమిషనర్లుగా నియమించాలని గుర్తుచేశారు. గత కమిషన్‌లోని ప్రధాన కమిషనర్ 2020 ఆగస్టు 24న పదవీ విరమణ చేయగా, మిగిలిన కమిషనర్లు గతేడాది ఫిబ్రవరి 24న రిటైర్ అయ్యారని పేర్కొన్నారు. అప్పటి నుంచీ కమిషన్ ఉనికిలోనే లేదన్నారు.

కమిషన్ పనిచేయని కారణంగా దాదాపు 15 వేల అప్పీళ్లు అక్కడ పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటికైనా వెంటనే ఫంక్షనింగ్ జరిగేలా సత్వరం కమిషన్‌ను నియమించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.


Similar News