2014 నుంచి నియామకాల్లో అవకతవకలు.. మాజీ ఎంపీ బూర సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు జరిగిన అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు జరిగిన అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీల్లో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. టీఎస్ పీఎస్సీ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సిట్ కేసీఆర్ కిట్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. గడిచిన ఎనిమిదేళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలకు కేసీఆర్ ఏం చేశారని ధ్వజమెత్తారు. కష్టం తమ వరకు వచ్చేసరికి కార్యకర్తలపై కేసీఆర్ మొసలి కన్నీరు కార్చుతున్నారని, బీఆర్ఎస్ పెట్టేవి ఆత్మీయ సభలు కాదు ఆత్మ వంచన సభలు అని ఎద్దేవా చేశారు. యువ మోర్చా అధ్యక్షుడు భానుప్రకాశ్‌ను జైల్లో పెట్టించి కొట్టిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలను కల్వకుంట్ల కుటుంబ సభ్యులు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని కొందరు మంత్రులు కల్వకుంట్ల కుటుంబానికి బాడీ గార్డులుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
కల్వకుంట్ల ప్రభుత్వం బీసీలను అణిచివేస్తున్నదని, కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ సమాధి చేసేది బీసీలేనని అన్నారు. బీసీలు ఏకమైతే కల్వకుంట్ల సామ్రాజ్యం కూలిపోవడం ఖాయం అన్నారు. బీజేపీలో సామాన్య కార్యకర్త అత్యున్నత స్థాయికే చేరే అవకాశం ఉందని ఇలాంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీలో ఉందా అని ప్రశ్నించారు. రెడ్డి సామాజిక వర్గంలో బలమైన వ్యక్తుల ఆర్థిక మూలలను దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని ఖమ్మం, మహబూబ్ నగర్, చేవెళ్ల, భువనగిరి మాజీ ఎంపీలు పొంగులేటి, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట కలెక్టర్ గా పనిచేసిన బీసీ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ ప్రభుత్వ స్థలంలో ఎన్నికల ప్రచారం చేయవద్దని మంత్రికి చెప్పినందుకు అతడిని గవర్నర్ కార్యాలయానికి బదిలీ చేశారని అన్నారు.