మన్నించాలని వేడుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

పార్టీ తరపున తప్పులు జరిగి ఉంటే కార్యకర్తలు మన్నించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు.

Update: 2024-01-07 14:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ తరపున తప్పులు జరిగి ఉంటే కార్యకర్తలు మన్నించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోయినప్పటికీ పార్టీ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహమే ఉందని, ఈ సమావేశాలు జరుగుతున్న తీరు సూచిస్తున్నదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని దిగ మింగుకుని పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదల నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తుందన్నారు. లోపాలను సమీక్షించుకుని పార్లమెంట్ ఎన్నికల నాటికి బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధితో పాటు ఢిల్లీలో కేంద్రంతో తెలంగాణ సమస్యలపై బీఆర్ఎస్ చేసిన పోరాటాన్ని ప్రజలకు గుర్తు చేసి ఓట్లు అడుగుదామన్నారు. పార్టీ ఎంపీలు లోక్ సభలో లేకపోతే కాంగ్రెస్, బీజేపీలు ఆడిందే ఆట .. పాడిందే పాట అన్నట్టుగా ఉంటుందన్నారు. విభజన సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, తెలంగాణకు న్యాయం చేయడం జాతీయ పార్టీల వల్ల కాదన్నారు.

బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సమస్యలను పరిష్కరించదు.. కాంగ్రెస్ నిలదీయదు అని విమర్శించారు. తెలంగాణ పాలిట బీజేపీది మొండి చెయ్యి.. కాంగ్రెస్‌ది తొండి చెయ్యి అని దుయ్యబట్టారు. రాష్ట్రం హక్కులను సాధించుకోవాలంటే తెలంగాణ గడ్డమీద పుట్టిన బీఆర్ఎస్‌కే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. మనం అధికారంలో ఉన్నపుడు కేంద్రంతో సఖ్యతగా లేమని రేవంత్ అంటున్నారని, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను గుర్తుచేసుకోవాలని సూచించారు. కేంద్రంలో ఎవరిని కలిసినా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని అడ్డగోలు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న వారు రాజకీయాలను పట్టించుకోరని రేవంత్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు తాము మంచి చేయం.. కేసీఆర్ చేసిన మంచిని తుడిచేస్తాం అన్నట్టుగా ఉందని విమర్శించారు.

కేసీఆర్ ఆలోచించి దేశంలోనే వినూత్నంగా ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గం అని, స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ పేదల పొట్టగొట్టొద్దని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించే బదులు బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమైందని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు బలం ఉంది.. కార్యకర్తల బలగం ఉందని ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. ప్రజల ఆకాంక్షల కనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే వాటి స్వరూపాన్ని కూడా మార్చాలని చూడటం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. అనవసరమైన వాటి మీద టైమ్ వృధా చేసే బదులు హామీల అమలుపై దృష్టిసారించాలని సూచించారు. ప్రజా పాలన పేరిట వచ్చిన దరఖాస్తుల్లో జాప్యం చేయకుండా మోక్షం కల్పించాలని సూచించారు. అడ్డగోలు నిబంధనలతో కోతలు పెడతామంటే కుదరదన్నారు. వంద రోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పప్పులు ఉడకవు అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News