కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం భేటీ.. చర్చంతా దానిపైనే!

కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకుని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

Update: 2022-09-11 08:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకుని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. లంచ్ మీటింగ్‌లో దేశంలోని తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. బీజేపీ వ్యతిరేక పోరాటం సహా జాతీయ రాజకీయాలు, అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు కుమారస్వామి ఇక్కడికి వచ్చినట్లు ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోజరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 మార్చి-మే మధ్య జరిగే లోక్‌‌సభ ఎన్నికలు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉండాల్సిన అవసరంపై చర్చించినట్లు తెలిసింది. మాజీ ప్రధాని దేవెగౌడతో గతంలో బెంగుళూరులోని ఆయన నివాసంలో కేసీఆర్ జరిపిన చర్చలకు కొనసాగింపుగా ఇప్పుడు ప్రగతి భవన్‌లో మంతనాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామి తొలుత మంత్రి కేటీఆర్‌తో ప్రైవేటు హోటల్‌లో చర్చలు జరిపారు. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు, వివాదాలు, త్వరలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ స్థాయిలో బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ప్రాంతీయ పార్టీలుగా పోషించాల్సిన పాత్ర తదితరాలన్నింటిపై చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరుగుతున్న చర్చల గురించి ప్రగతి భవన్ వర్గాలు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా జాతీయ రాజకీయాలు, జాతీయ అంశాలు తదితరాలపైనే కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి.

దివంగత ఉప ప్రధాని దేవీలాల్ జయంతి ఉత్సవాలను ఈ నెల 25న ఫతేబాద్‌‌లో జరుపుతున్నందున బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కటిగా థర్డ్ ఫ్రంట్ పేరుతో ఐక్యం కావాల్సిన అవసరంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్, కుమారస్వామి మధ్య చర్చల సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, రాజేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Also Read : 'మూడోసారి మోడీని ప్రధాని చేయడమే కేసీఆర్ లక్ష్యం'


Tags:    

Similar News