‘కారు’లో మొదలైన కంగారు.. కేడర్ చేజారకుండా చర్యలు

‘కారు’లో కంగారు మొదలైంది. కేడర్ చేజారకుండా చర్యలు చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపకుండా మనోధైర్యం కల్పించే వ్యూహాలు రచిస్తుంది.

Update: 2023-12-08 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కారు’లో కంగారు మొదలైంది. కేడర్ చేజారకుండా చర్యలు చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపకుండా మనోధైర్యం కల్పించే వ్యూహాలు రచిస్తుంది. గ్రామస్థాయి నుంచి లీడర్లతో సంప్రదింపులు చేస్తూ ఓపిక పట్టాలని రిక్వెస్టులు చేస్తున్నారు.

కేడర్‌ రక్షణకు చర్యలు

బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో కేడర్‌ను కాపాడుకునే పనిలో పడింది. కేవలం ఎన్నికలప్పుడే ఆపార్టీ నేతలకు కేడర్‌కు గుర్తుకు వచ్చేది. అయితే ప్రజాతీర్పుతో అధికారంలో కోల్పోవడంతో కేడర్ చేజారకుండా చర్యలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇవి సైతం కీలకం కానుండటంతో కేడర్ పార్టీ మారుతారేమోనని ఆందోళన మొదలైంది.

కేడర్‌కు రిక్వెస్టులు

గ్రామస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంది. అయినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేడర్‌ను పట్టించుకోకపోవడం, సమస్యలను విన్నవించేందుకు వెళ్తే కనీసం వినేందుకు సైతం నిరాకరించడం, ఏ గ్రామం నుంచి అయితే వెళ్తే ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల లిస్టును ముందువేసి ఎందుకు పనిచేయాలనే ప్రశ్నలు సంధించారు. గ్రామంలో అభివృద్ధి పనులకు సైతం నిధులు సరిపడా ఇవ్వకపోవడంతో పార్టీ ద్వితీయ శ్రేణినేతల్లో సై తం తీవ్ర అసంతృప్తి నెలకొంది. వారంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందు కున్న బీఆర్ఎస్ వారితో సంప్రదింపులు చర్యలు చేపడుతోంది. మరోవైపు ఓపిక పట్టాలంటూ రిక్వేస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు సైతం ఇస్తున్నారు.

నష్ట నివారణ చర్యలు

అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చినా పార్టీ మారొద్దనే సంకేతాలు ఇవ్వడం మొదలు పెట్టారు. వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ దేనని వారిలో భరోసా కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీకి దూరమైతే మీకే నష్టమని సూచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నేరుగా నేతలకు ఫోన్ చేసి పార్టీలో ఉండాలని కోరుతున్నారు. కొన్ని తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకుందామని కేడర్‌తో పేర్కొంటున్నారు.

Tags:    

Similar News