ఇండియన్ బ్యాంక్ మేనేజర్ పై రైతులు ఆగ్రహం.
రుణ మాఫీ కోసం వెళ్ళిన రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన బ్యాంక్ మేనేజర్ వైఖరికి నిరసనగా రోడ్డు పై ధర్నా నిర్వహించిన ఘటన గురువారం మెదక్ జిల్లాలో జరిగింది.
దిశ, మెదక్: రుణ మాఫీ కోసం వెళ్ళిన రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన బ్యాంక్ మేనేజర్ వైఖరికి నిరసనగా రోడ్డు పై ధర్నా నిర్వహించిన ఘటన గురువారం మెదక్ జిల్లాలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులకు రుణ మాఫీ చేస్తూ.. రైతులకు సమాచారం మొబైల్ కు పంపుతుంది. మండల పరిధిలోని తిమ్మక్క పల్లి, కొంటూర్, మంబోజీ పల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు మెదక్‌లోని ఇండియన్ బ్యాంకు వద్దకు వచ్చిన రైతులు తమకు రుణ మాఫీ వచ్చినట్లు మేనేజర్‌కు చెప్పగా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని రైతుల పట్ల మేనేజర్ దురుసుగా ప్రవర్తించినట్లు రైతులు తెలిపారు. ఆగ్రహించిన రైతులు బ్యాంక్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. తమకు రుణ మాఫీ ఇప్పిచాలని డిమాండ్ చేశారు. తిమ్మక్క పల్లి ఉప సర్పంచ్ మాట్లాడుతు ప్రభుత్వం రుణ మాఫీ చేసినట్లు మొబైల్ కు సమాచారం అందింది, కానీ తమకు రుణ మాఫీ కాలేదని మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని అన్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీస్‌లు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.