రేవంత్.. ఇప్పటికైనా ఆ బుద్ధి మానుకో: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్

కేసీఆర్, బీఆర్ఎస్ మీద కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం బురద జల్లుతోంది అనడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలే నిదర్శనమని.. కేసీఆర్ మీద

Update: 2024-07-16 11:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్, బీఆర్ఎస్ మీద కక్ష సాధింపుతో ఈ ప్రభుత్వం బురద జల్లుతోంది అనడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలే నిదర్శనమని.. కేసీఆర్ మీద బురద జల్లే దుర్బుద్దిని సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా మానుకోవాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా హల్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటివని చురకలంటించారు.

సుప్రీం వ్యాఖ్యలు మా వాదనకు బలం చేకూర్చేవి‌గా ఉన్నాయని, ఎప్పుడైనా చివరకు గెలిచేది న్యాయం, ధర్మమేనన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లే పద్ధతి మంచిది కాదని ఇకనైనా రేవంత్ ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు. ప్రభుత్వాల మధ్య కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశించడం అంటేనే దురుద్దేశ పూరిత చర్య అన మండిపడ్డారు. కరెంటు ఇచ్చి తెలంగాణ రైతును, పరిశ్రమలను కాపాడింది కేసీఆరేనని.. దేశ వ్యాప్తంగా తెలంగాణకు మంచి పేరు రావడానికి ఆయన విధానాలే కారణమని అన్నారు.

కేసీఆర్ మంచి పేరును చెరిపి వేయడమే సీఎం రేవంత్ లక్ష్యమని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మీద బురద జల్లేందుకు రేవంత్ సీరియల్ స్క్రిప్ట్ రచించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ రేవంత్‌కు ఆదిలోనే హంసపాదు తగిలిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద విచారణలు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదని.. ఇకనైనా గ్యారంటీల అమలు మీద దృష్టి పెట్టాలని సూచించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను బీఆర్ఎస్ సంపూర్ణంగా గౌరవిస్తుందని, న్యాయ స్థానాల మీద మాకు గౌరవం ఉందన్నారు.


Similar News