సీఎం రేవంత్ సవాల్‌కు ఈటల కౌంటర్.. ముందు ఆ పని చేయాలని సూచన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) స్పందించారు. గురువారం ఈటల ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడాన్ని తామేం తప్పుబట్టడం లేదని.. తాము కూడా చేయాలనే కోరుకుంటున్నామని అన్నారు. మూసీలోకి కెమికల్ నీళ్లు రాకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడి మూసీ నీటిని మంచినీటి మార్చాలని విజ్ఞప్తి చేశారు. అసలు మూసీ సుందరీకరణకు, మూసీ పరివాహక ప్రాంతాల ఇళ్ల కూల్చివేతకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని మీరు.. ఇచ్చిన హామీలు అమలు చేయలేని మీరు రూ.లక్షా 50 వేల కోట్లు పెట్టి మూసీని అభివృద్ధి చేస్తారా? అని ఈటల రాజేందర్ విమర్శించారు.
మురికినీటికి పరిష్కారం చూపిస్తే ఇళ్లను కూల్చేయాల్సిన పరిస్థితి ఉండదని అన్నారు. ఇదిలా ఉండగా.. అంతుకుముందు మూసీ నదిపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈటల రాజేందర్‌కు సవాల్ చేశారు. మూసీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లు మూసీ పరివాహక ప్రాంతాల్లో మూడు నెలలు నివాసం ఉండాలని సూచించారు. అక్కడి పరిస్థితిని అనుభవించాలని చెప్పారు. మూడు నెలలు మీరు అక్కడ ఉండగలిగితే ప్రాజెక్ట్‌ను ఆపేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన ఈటల రాజేందర్ పై వ్యాఖ్యలు చేశారు.