మణుగూరు మున్సిపాలిటీలో పాతుకు పోయిన ఉద్యోగులు
మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎందరో కమిషనర్లు మారినా అందులో పనిచేసే కొందరు ఉద్ద్యోగులు మాత్రం మారడం లేదు. దాదాపు పదేళ్లుగా మున్సిపాలిటీలో పనిచేస్తూ కార్యాలయాన్నే అంటి పెట్టుకొని ఉంటున్నారు.

దిశ, మణుగూరు: మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎందరో కమిషనర్లు మారినా అందులో పనిచేసే కొందరు ఉద్ద్యోగులు మాత్రం మారడం లేదు. దాదాపు పదేళ్లుగా మున్సిపాలిటీలో పనిచేస్తూ కార్యాలయాన్నే అంటి పెట్టుకొని ఉంటున్నారు. కార్యాలయంలో జరిగే లొసుగులు, ఆదాయం వచ్చే మార్గాన్ని క్షుణ్నంగా అవపోసన పట్టి ఇక్కడే పాతుకుపోయారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి అందినకాడికి దోచుకొని కోట్ల రూపాయలు సంపాదించి, విలాసవంతమైన భవనాలు నిర్మించి మణుగూరులోనే స్థిరపడిపోయారని తెలుస్తోంది. గతంలో అవినీతి పనులలో పట్టుపడి సస్పెండైన వారే మళ్లీ ఇక్కడే ఉద్యోగం చేయడం గమనార్హం.
వచ్చిన కమిషనర్లను తమ గుప్పెట్లో పెట్టుకుని కొన్ని కోట్ల రూపాయలను కొల్లకొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషర్లు వస్తావుంటారు.. పోతావుంటారు..! కానీ మేము లోకల్.. ఇక్కడే ఉద్యోగాలు చేస్తాం, ఇక్కడే ఉంటాం..! అనేలా వ్యవహరిస్తున్నారు. అంతేగాక కార్యాలయంలో ఎవరికైనా ఉద్యోగ బదిలీ ఏర్పడితే వెంటనే మున్సిపాలిటీకి సంబంధించిన వరంగల్ సీడీఎంఏ కార్యాలయంలో ఓ పెద్ద అధికారిని కలిసి కొంత ముడుపులు ముట్టజెప్పి మళ్లీ ఇదే కార్యాలయంలో పోస్టింగ్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆడిందే ఆటగా..
మున్సిపాలిటీలో ఉండే కొందరు అధికారులు ఆడిందే..ఆటగా.. పాడిందే పాటగా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కార్యాలయంలో పని చేసే కొందరు అధికారులు ఒక్కడో ఒక దగ్గర అవినీతికి పాల్పడి సస్పెండై వచ్చినవారు కావడమే విశేషం. సస్పెండైన అధికారులతో మున్సిపాలిటీ ఎలా అభివృద్ధి జరుగుతుందని మండల ప్రజలు, పలువురు ప్రశ్నిస్తున్నారు. పలు సమస్యల గురించి అధికారులను నిలదీస్తే వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పెద్ద ఎత్తున అవినీతి?
మున్సిపాలిటీ కార్యాలయం లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి ఏ..కమిషనర్ వచ్చిన ఆ అధికారులకు భయం ఉండదు. వచ్చిన కమిషనర్‌కే మాయమాటలు చెప్పి కొన్ని ప్రభుత్వ బిల్లులు నొక్కుతున్నారనే వినికిడి వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయలు నిధులు తీసుకువస్తే ఆ నిధులను దుర్వినియోగం చేసి లక్షల్లో నొకేస్తున్నారని తోటి ఉద్యోగులే చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆ అధికారుల చేతిలో..
మున్సిపాలిటీ అంతా ఆ అధికారుల చేతిలోనే ఉందని మండల వ్యాప్తంగా వినపడుతోంది. ఆ అధికారుల ఆస్తులు కోట్ల రూపాయలలో ఉందని పలువురు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో ఏ బిల్లు చేసినా వీరికి పర్సంటేజ్ రూపంలో పోవాల్సిందే లేదంటే. ఆ బిల్లు ఆపేస్తారనే వినికిడి వినపడుతోంది. ప్రతి దాంట్లో పర్సంటేజ్లు తీసుకుంటూ కోట్ల రూపాయలను సొమ్ము చేసుకున్నారని వినపడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇక్కడి నుంచి ఏ అధికారి ట్రాన్స్‌ఫర్ కాలేదు
కార్యాలయం నుంచి ఏ అధికారి ట్రాన్స్‌ఫర్ కాలేదు. అలాగే ట్రాన్స్‌ఫర్ అయ్యి ఇదే కార్యాలయంలో డిప్యూటేషన్‌పై ఎవరూ పని చేయడం లేదు. సీడీఎంఏ నుంచి నేను ఒక్కరే రెగ్యులర్ ఉద్యోగిగా ఉన్నాను. మిగతా వారు రీజినల్ డైరెక్టర్ పరిధిలో పని చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి రూ.60లక్షల గ్రాంట్ ఫౌండ్స్ ఏమీ రాలేదు. గత డిసెంబర్‌లో రూ.27లక్షలు స్టేట్ ఫైనాన్స్ పట్టణ ప్రగతి కింద మంజురయ్యాయి. ఆ రూ.27 లక్షలు తమ అధీనంలోనే ఉన్నాయి. దేనికీ ఖర్చు చేయలేదు. నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు మాత్రమే అయింది.-మున్సిపాలిటీ కమిషనర్