దిశ, వెబ్ డెస్క్ : డైట్ కాలేజీ విద్యార్థుల(Diet Students) ఉజ్వల భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) నుంచి మరింత చేయూత అందించేందుకు కృషి చేస్తానని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి డీ.కే.అరుణ(MP DK Aruna)తెలిపారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.8.26 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పాలమూరు డైట్ కాలేజీ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి(Yennam Srinivasa Reddy)తో కలిసి అరుణ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ పాలమూరును విద్యాక్షేత్రంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. కేంద్రం మంజూరు చేసిన ఈ నిధులతో డైట్ కాలేజీలో కొత్త భవనాలు, అకడమిక్ బిల్డింగ్, కంపౌండ్ వాల్ ఇతర అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ పనులన్నింటినీ త్వరగా పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. భవన నిర్మాణాలు పూర్తయితే 300 మంది విద్యార్థినులకు మరిన్ని వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.