Danam : అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలకు కారణమదే.. దానం నాగేందర్ క్లారిటీ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం దానం నాగేందర్ సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
దిశ, హిమాయత్ నగర్ : అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలనే తనను టార్గెట్ చేశారని, హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో దానం నాగేందర్ మాట్లాడారు. తనను బయటకు చెప్పలేని పదాలతో దూషించారని తెలిపారు.
వారు మాట్లాడింది, మైక్‌లో రికార్డ్ కాలేదని, వారి మాటలకు సమాధానంగానే ఆ వ్యాఖ్యలు చేసానని దానం నాగేందర్ అన్నారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుండి బీఆర్ఎస్ నాయకులు సభను సజావుగా జరగకుండా అడ్డంకులు సృష్టించారని, ప్రతిపక్షంగా వారికి సమస్యలపై చర్చలు చేయాల్సిన బాధ్యత ఉంది కానీ అలా జరగలేదన్నారు. గత పదేళ్లుగా ఏనాడు తన లాంటి వారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పద్ధతిని మార్చుకోవాలని దానం నాగేందర్ సూచించారు. తాను చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ వాడుక భాషలోనివని.. అయినా ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెబుతున్నా అన్నారు.