కేంద్రంతో కలుపుగోలుగా..! రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా భేషజాలు పక్కన పెట్టిన సీఎం

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండక సమస్యలు కొనితెచ్చుకునేదనే విమర్శలు ఉండేవి.

Update: 2024-12-15 01:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండక సమస్యలు కొనితెచ్చుకునేదనే విమర్శలు ఉండేవి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా సీఎం రేవంత్ రెడ్డి రెగ్యులర్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌తో టచ్‌లో ఉంటున్నారు. నేరుగా ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తూ వినతులు సమర్పిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో రెండు సార్లు ప్రధాని మోడీని, 12 సార్లు కేంద్ర మంత్రులను కలిసిన ముఖ్యమంత్రి తెలంగాణకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని, విభజన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇక రాజకీయ అంశాలపై బీజేపీని ఎండగట్టడంలో ఎక్కడా వెనుకాడని సీఎం.. ప్రధానిపై ఘాటైన విమర్శలు చేస్తూనే ఉన్నారన్న చర్చ జరుగుతున్నది.

ఫలితం ఇస్తున్న రిక్వెస్టులు

బీఆర్ఎస్ హయంలో పలు సంక్షేమ పథకాల అమలులో కేంద్రం తన వాటా నిధులు రిలీజ్ చేయకుండా పేచీ పెట్టింది. యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తేనే తమ వాటా నిధులు విడుదల చేస్తామని షరతు విధించేది. కానీ నాటి ప్రభుత్వం యూసీ ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చాలా వరకూ ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపుతున్నది. ఏడాది కాలంలో పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో కేంద్రం తన వాటా నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. మంత్రులు సైతం రెగ్యులర్‌గా తమ శాఖ పరిధిలోని సమస్యలను కేంద్ర మంత్రులను కలిసి వినతులు సమర్పిస్తున్నారు. రోడ్స్, రైల్, హెల్త్, ఎడ్యుకేషన్, ఆర్థిక శాఖల్లో ఉన్న పలు సమస్యలను ఆయా శాఖల మంత్రులు.. సెంట్రల్ మినిస్టర్ల దృష్టికి తీసుకొస్తే కొంతలో కొంతైన పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉన్నది.

విభజన సమస్యల పరిష్కారం కోసం

విభజన సమస్యలు పరిష్కరించాలని తరచుగా సీఎం రేవంత్ కేంద్రాన్ని కోరుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని విభజన సమస్యలు కొలిక్కి వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లేబర్ సెస్ కింద రాష్ట్రానికి.. ఏపీ ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని అంటున్నారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ విభజన అంశం పరిష్కర దశలో ఉన్నది. త్వరలో అక్కడ తెలంగాణ భవన్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాలతో.. కేంద్ర అధికారులు త్వరలో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

రాజకీయ అంశాలపై ఎటాకింగ్

కేంద్రం నుంచి రావాల్సిన వాటా కోసం ఓ పక్క వినతులు ఇస్తున్న సీఎం.. మరో వైపు పొలిటికల్‌గా బీజేపీపై దాడి చేస్తున్నారు. ప్రధాని మోడీ.. అదానీ కంపెనీకి మద్దతు పలుకుతున్నారని ఏఐసీసీ ఆరోపిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో దేశవ్యాప్తంగా ఒక రోజు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆ రోజున సీఎం రేవంత్.. హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అదనపు నిధులు ఇస్తారని రేవంత్ ఆశించారు. కానీ కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించలేదు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం కక్ష కట్టిందని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. నిధుల కేటాయిపులో వివక్ష చూపినందుకు గాను ఈ ఏడాది జూలైలో జరిగిన నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News