బీఆర్ఎస్ పునాదుల్ని కదిలించేలా వ్యూహం.. ఆ ప్రాంతాలపై కాంగ్రెస్ ఫోకస్

గులాబీ పార్టీ పునాదుల్ని కదిలించేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. క్షేత్ర స్థాయి లీడర్లను తమ వైపు గుంజుకొని ‘కారు’‌ టైర్లకు పంక్చర్ చేయాలని పక్కా ప్రణాళిక రచిస్తున్నది.

Update: 2024-01-21 01:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ పునాదుల్ని కదిలించేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. క్షేత్ర స్థాయి లీడర్లను తమ వైపు గుంజుకొని ‘కారు’‌ టైర్లకు పంక్చర్ చేయాలని పక్కా ప్రణాళిక రచిస్తున్నది. బీఆర్ఎస్‌లో అవమానాలు, చీదరింపులు ఎదుర్కొని పార్టీ మారేందుకు సిద్ధమైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు గాలం వేసేందుకు కసరత్తు స్టార్ట్ చేస్తుందని తెలుస్తున్నది.

‘మేం వస్తాం’ అంటూ ఒత్తిళ్లు

మెజార్టీ గులాబీ లీడర్లు ఆ పార్టీలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని ప్రచారంలో ఉన్నది. అందులోనే కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని నిర్ణయానికి వచ్చిన లీడర్లు పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్‌లోకి వెళ్తే కనీస మర్యాద దక్కుతుందని అంచనాకు వచ్చి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. అందులో భాగంగా తమను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తరుచుగా వారిని రహస్యంగా కలుస్తున్నట్టు టాక్. అయితే వలసల పరంపర కొంతకాలం పాటు కొనసాగించేందుకు కాంగ్రెస్ మొగ్గుచూపుతున్నది. మొదటి దశలో లోకల్ లీడర్లు, ఆ తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

రివర్స్ పంచ్ ఇచ్చేలా..

బీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నది. అప్పుడు ఆ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం సరి కాదనే అభిప్రాయాలు వచ్చాయి. ఇదే చర్చ గ్రామ స్థాయిలోనూ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఎమ్మెల్యేల జోలికి వెళ్లకుండా, క్షేత్ర స్థాయి లీడర్లను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను చేర్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు టాక్ ఉంది.

గ్రేటర్ హైదరాబాద్‌పైనే టార్గెట్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ చాలా వీక్‌గా ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సింగిల్ సీటు కూడా గెలవలేదు. ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలంటే ఇతర పార్టీలకు చెందిన లీడర్లను చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా బీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే సుమారు 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ వీడేందుకు రెడీ గా ఉన్నట్టు సంకేతాలు పంపారని తెలిసింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న పలు కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్. వీరందరికీ ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముహుర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది.

త్వరలో చేరికలు

లోకసభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం స్థానిక లీడర్లతో మంత్రులు రివ్యూలు చేస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీలకు చెందిన లీడర్లను చేర్చుకోవాలని భావిస్తున్నారు. జిల్లా పర్యటనలకు వెళ్తున్న క్రమంలో పలు పార్టీలకు చెందిన లీడర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా మెజార్టీ మంది లోకల్ లీడర్లు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నట్టు ప్రచారంలో ఉన్నది.

Tags:    

Similar News