BRS పుట్టిందే అబద్ధాల పునాదులపై.. హరీష్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్

మాజీ మంత్రి హరీష్​రావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు.

Update: 2024-07-29 14:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి హరీష్​రావు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పుట్టిందన్నారు. హరీష్ రావు పది అబద్ధాలు మాట్లాడి, ఒక నిజం చెప్తాడన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామని, బీఆర్ఎస్ ప్రభుత్వ ఒప్పందాలను తమ సీఎం బయట పెట్టాడన్నారు. మేడిగడ్డ కుంగిపోతే ప్రతిపక్షాలు, మీడియా వెళ్లకుండా పోలీస్ బందోబస్తు పెట్టిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో నీళ్ళు నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందన్నారు. పిక్నిక్‌లా కేటీఆర్, హరీష్ రావు మేడిగడ్డకు పోయి వచ్చారన్నారు. మేడిగడ్డ దుస్థితికి హరీష్ రావు కారణం కాదా..? అంటూ ప్రశ్నించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని, దిగువన ఉన్న బ్యారేజీలను నింపి రైతులకు నీళ్లు అందిస్తామన్నారు. అసెంబ్లీలో ఓడించినా, లోక్ సభలో డిపాజిట్లు పొగొట్టినా సిగ్గు రావడం లేదన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధు సుదన్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ మోసాలను తమ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బయటకు తీస్తున్నారన్నారు. అసెంబ్లీలో మాట్లాడలేక హరీష్ రావు మీడియాతో చిట్ చాట్‌లు చేస్తున్నాడని మండిపడ్డారు. అబద్దాలకు హరీష్ రావు కేరాఫ్ అడ్రస్‌గా తయారయ్యాడన్నారు. జైపాల్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి, అర్హత హరీష్ రావుకు లేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించింది జైపాల్ రెడ్డి అని గుర్తు చేశారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. అబద్దాన్ని నిజం చేయడంలో కేసీఆర్ కుటుంబం దిట్ట అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్ష కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వల్లనే నీళ్లు అందుతున్నాయన్నారు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలను నమ్మరని నొక్కి చెప్పారు. వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను బీఆర్ఎస్ నిలబెట్టుకోవాలన్నారు.

ఇక తెలంగాణ పోలీసులపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ పేరు తో వ్యవస్థను పాడు చేసిందన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా అక్కడక్కడ హత్యలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో మంథనిలో నడిరోడ్డుపై న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేశారన్నారు. 2011 లో అక్బరుద్దీన్ పై దాడి జరిగినప్పుడు పోలీసులే కాపాడిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..సత్యహరిశ్చంద్రుడి లా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.


Similar News