కాళేశ్వరంపై కమిషన్ విచారణ స్పీడప్.. రేపటి నుంచి ఎంక్వయిరీకి ఇంజినీర్లు హాజరు
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్
దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. దాదాపు మూడు వారాల పాటు అఫిడవిట్ల కోసం సమయం ఇచ్చిన కమిషన్.. గత నెల 27వ తేదీ వరకు అందిన వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నది. మూడు బ్యారేజీల డ్యామేజీలపై ప్రధాన దృష్టి పెట్టిన కమిషన్.. లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్‌హౌజ్‌లకు చెందిన చీఫ్ ఇంజినీర్ మొదలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వరకు సోమవారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీచేసింది. వీరు వెల్లడించే వివరాలన్నీ రికార్డు రూపంలో నిక్షిప్తం కావాల్సి ఉన్నందున అఫిడవిట్ల రూపంలో సమర్పించాల్సిందిగా కమిషన్ సూచించనున్నది. పంప్ హౌజ్‌ల నిర్మాణం, ప్రభుత్వ ఆమోదం మొదలు నిర్వహణ వరకు, గత వరదల్లో మునిగిపోవడానికి దారితీసిన కారణాలన్నింటినీ వీరి ద్వారా కమిషన్ సేకరించనున్నది.
ఈ ఎంక్వయిరీలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను, కరస్పాండెన్స్ ను, ఉత్తర్వులను అందజేయాల్సిందిగా సాగునీటిపారుదల శాఖ అధికారులను కమిషన్ ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే ఫీల్డ్ విజిట్ చేసి లోతుగా అధ్యయనం చేసిన స్టేట్ విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విభాగాలకు కూడా లేఖ రాసిన కమిషన్... ఇప్పటివరకూ మధ్యంతర నివేదికలను మాత్రమే ఇచ్చినందున తుది నివేదికలను తొందరగా అందజేయాల్సిందిగా సూచించింది. ఎన్డీఎస్ఏ చైర్మన్‌తో ఇప్పటికే కమిషన్ చైర్మన్ (కమిషనర్)గా ఉన్న జస్టిస్ పీసీ ఘోష్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ నివేదికల్లో మూడు బ్యారేజీలు ఎందుకు డ్యామేజ్ అయ్యాయో అధ్యయనం చేసినందున వాటికి అనుగుణంగా సంబంధిత అధికారుల నుంచి ఇప్పటికే రాబట్టిన వివరాలు, అఫిడవిట్లలో వారు పొందుపరిచిన అంశాలను కమిషన్ విశ్లేషించనున్నది.
మరోవైపు బ్యారేజీల డ్యామేజీపై పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చి స్టేషన్‌కు చెందిన నిపుణుల కమిటీ కూడా స్టడీ చేసినందున దాని పరిశీలనలో తేలిన అంశాలను తెలుసుకోడానికి కమిషన్ తరఫున ఓ ప్రతినిధి ఇటీవల వెళ్ళి వివరాలను సేకరించారు. దీనికి తోడు కమిషన్ ఇప్పటికే కొద్దిమంది నిపుణులతో ఓ కమిటీని నియమించుకున్నందున ఇప్పటివరకు అందిన అఫిడవిట్లలోని అంశాలపై వారితో జస్టిస్ పీసీ ఘోష్ చర్చించినట్లు తెలిసింది. ఈ నిపుణులను బ్యారేజీల క్షేత్రస్థాయి అధ్యయనం కోసం కూడా పంపినందున వారి స్టడీలో వెల్లడైన అంశాలపై కూడా నివేదికను తొందరగా సమర్పించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అఫిడవిట్లలో ఇరిగేషన్ డిపార్టుమెంటు అధికారులు, ఇంజినీర్లు వెల్లడించిన అంశాలకు, ఓరల్‌గా ప్రస్తావించిన అంశాలకు మధ్య తేడా ఉన్నట్లయితే వారిని మరోమారు విచారించడానికి వీలుగా నోటీసులు జారీచేసే అంశం కూడా తెరమీదకు వచ్చింది. సోమవారం తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది.
బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల నిర్మాణం, నిర్వహణ అంశాల్లో నిర్ణయం ఎవరు తీసుకున్నారు... వాటిని నిర్మించి మెయిన్, సబ్ కాంట్రాక్టర్లు ఎవరు... అంచనా వ్యయం పెరగడానికి దారితీసిన పరిస్థితులు... మొత్తంగా ఇరిగేషన్ డిపార్టుమెంటు తరపున ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్, సూపర్‌విజన్ బాధ్యత ఎవరిది... ఇలాంటి అంశాలన్నింటినీ కమిషన్ లోతుగా పరిశీలించనున్నది. కమిషన్‌కు వచ్చే వివరాలన్నీ అఫిడవిట్ రూపంలో ఉండాలని మొదట్లోనే నొక్కిచెప్పి రికార్డు చేయాలని నిర్ణయించింది. ఇకపైన జరిగే ఎంక్వయిరీలో సైతం రాతపూర్వకంగానే కమిషన్ తెలుసుకోనున్నది. ఇప్పటికే అఫిడవిట్లు ఇచ్చినవారిలో ఎవరెవరికి మరోసారి నోటీసులు జారీచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.